తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జూలై 21న కౌశిక్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.
హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ టికెట్ తనకే ఖరారయిందని ఓ కార్యకర్తతో జరిపిన ఫోన్ సంభాషణ ఆడియో లీక్ కావడంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, తానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులు, అభిమానులతో చర్చలు జరిపిన కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్‌లోనే చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జులై 21న పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరితే హుజురాబాద్ టికెట్ ఆయనకే ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయం