హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాన్ ని ఎంపిక చేసింది.ఇప్పటి వరకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కుమారి సెల్జా కొనసాగారు. ఆమె స్థానంలో ఈ సారి హైకమాండ్ ఉదయ్ భాన్ కు అవకాశం ఇచ్చింది. అధ్యక్షుడితో పాటు రాష్ట్ర యూనిట్ కు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లను నియమించింది. గత కొన్ని వారాలుగా రాష్ట్ర శాఖ పునర్వ్యవస్థీకరణ అంశం రాష్ట్ర హర్యానా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి తెరదించుతూ ఎట్టకేలకు కొత్త కమిటీని హైకమాండ్ ఏర్పాటు చేసింది. కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా శృతి చౌదరి, రామ్ కిషన్ గుజ్జర్, జితేందర్ కుమార్ భరద్వాజ్, సురేష్ గుప్తాలను ఎంపిక చేసింది. కాగా హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవికి కుమారి సెల్జా చేసిన రాజీనామాను పార్టీ అధ్యక్షురాలు వెంటనే ఆమోదించారని సీనియర్ నాయకుడు కె సి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని రోజుల క్రితం పార్టీ హైకమాండ్‌కు తన రాజీనామాను సమర్పించానని, తనను తాను ‘‘ పార్టీకి నిజమైన సైనికురాలిగా’’ అభివర్ణించానని కుమారి సెల్జా మీడియాతో తెలిపారు. ‘‘ నేను కాంగ్రెస్ పార్టీకి నిజమైన సైనికుడిని. నా హైకమాండ్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందరం కలిసి పని చేస్తాం. కొత్త రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి, వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు నా అభినందనలు చెప్పారు.
నూతనంగా అధ్యక్షుడిగా ఎంపికైన ఉదయ్ భాన్ షెడ్యూల్డ్ కులాల కమ్యూనిటీకి చెందినవాడు. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. హోడల్ నియోజకవర్గం నుంచి ఆయన గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న హుడా ఉదయ్ భాన్ నియామకం పట్ల స్పందించారు. ఆయన అట్టడుగు స్థాయిలో పనిచేసిన నాయకుడని, కష్టపడి పని చేస్తాడని చెప్పారు. ఆయన నియామకం కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుస్తుందని తెలిపారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.