దేశమంతా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు శంకర్‌సింగ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ వాఘేలా ఇవ్వాల (శుక్రవారం) పలువురు పార్టీ నేతల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రాజీనామా చేసిన కొద్ది రోజుల తర్వాత మహేంద్రసింగ్ వాఘేలా కాంగ్రెస్‌లో చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఇవ్వాల నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేంద్రసింగ్ వాఘేలా మాట్లాడుతూ.. తాను బీజేపీలో ఎప్పుడూ సంతోషంగా లేనని, ఆ పార్టీలో చేరినప్పటికీ గత ఐదేళ్లలో తాను పార్టీ కార్యక్రమాల్లో ఏ రోజూ పాల్గొనలేదన్నారు. అంతేకాకుండా తన భావజాలం ఆ పార్టీకి భిన్నమైనదని కూడా ఆయన అన్నారు.
ఇక.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు, అది పార్టీ హైకమాండ్‌పై ఆధారపడి ఉంటుందని, పార్టీ తనకు ఎలాంటి అసైన్‌మెంట్ ఇచ్చినా హ్యాపీగా స్వీకరిస్తానని మహేంద్రసింగ్ వాఘేల అన్నారు. 2017 గుజరాత్ ఎన్నికలకు ముందు వాఘేలా బీజేపీలో చేరారు. దీనికి ముందు అతను 2012, 2017 మధ్య ఉత్తర గుజరాత్‌లోని బయాద్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇక.. అహ్మదాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ జగదీష్ ఠాకూర్ తమ పార్టీలోకి అతడిని ఆహ్వానించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శంకర్‌సింగ్ వాఘేలా ఈ మధ్యనే సొంతంగా ‘‘ప్రజా జనశక్తి’’ పార్టీని ప్రారంభించారు. మరి తన తండ్రి పార్టీలో చేరలేదనే ప్రశ్నపై, మహేంద్రసింగ్ వేఘేలా ఈ విషయాన్ని తన తండ్రితో చర్చించానని.. అతని ఆమోదంతోనే కాంగ్రెస్‌లో చేరినట్టు చెప్పారు. కాగా.. శంకర్‌సింగ్ వాఘేలా తన ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే గుజరాత్‌లో మద్యం నిషేధం తొలగిస్తామని హామీ ఇచ్చారు.
======================================.