Friday, November 22, 2024

రేవంత్ మాస్టర్ స్కెచ్.. వలసలు షురూ

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. పీసీసీ చీఫ్ గా నియామితులైన తర్వాత పార్టీ సీనియర్ల లీడర్ల మద్దతు కూడగట్టిన రేవంత్.. ఇప్పుడు పార్టీకి చెందిన మాజీ నేతలపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులు మళ్లీ తిరిగి సొంత గూటికి రావాలని ఇప్పటికే రేవంత్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా కాంగ్రెస్ ను వీడిన మాజీ నేతలతో సమావేశం అవుతున్నారు. పలు జిల్లాల టీఆర్ఎస్ నేతలతో భేటీలు అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై వారు సంకేతాలు పంపించారు. భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణ, సీనియర్ నేత డీఎస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్, మహబూబ్‌నగర్ జిల్లా నేత ఎర్ర శేఖర్ తదితరులతో సమావేశం అయ్యారు. వారు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని బలపర్చడానికే తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నానని నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. మంచి రోజు చూసుకొని పార్టీలో చేరతానన్నారు. తన తండ్రి డీఎస్ కోసం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నానని, కానీ అది కండువా కాదు.. గొడ్డలి అని తనకు తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీయే కాదన్నారు. కడుపులో కోపం ఉన్నా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తన తమ్ముడు ఏ పార్టీలో ఉంటే.. తనకేంటి అని ప్రశ్నించారు.

రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక తన మార్క్ వ్యూహాలతో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా సాగుతున్నారు. అందుకు తనతో కలిసి వచ్చే నాయకులను కలుపుకుపోతున్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో మరన్ని వలసలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement