Monday, November 18, 2024

అడవుల పెంపు భేష్‌.. అగ్రస్థానంలో తెలుగు రాష్ట్రాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా అడవుల నరకివేత, కార్చిచ్చు కారణాలతో అటవీ విస్తీర్ణం నానాటికీ తరిగిపోతుండగా, భారతదేశంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండేళ్లలో దేశంలో ఏకంగా 2,261 చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణం పెరిగిందని ‘ఫారెస్ట్ సర్వే రిపోర్ట్, 2021’ తేల్చి చెప్పింది. ఇందులో అత్యధికంగా 647 చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌లో పెరగగా, 632 చ.కి.మీ మేర పెరిగిన విస్తీర్ణంతో ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. 537 చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణం పెరిగిన ఒడిశా 3వ స్థానంలో నిలిచింది. ఎక్కువ అటవీ భూభాగం కల్గిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఇప్పటికీ మొదటిస్థానంలో కొనసాగుతోంది.

భూభాగంలో అడవుల శాతాన్ని లెక్కిస్తే 84.53% అడవులను కల్గిన మిజోరాం మొదటి స్థానంలో నిలవగా, అరుణాచల్ ప్రదేశ్ (79.33%), మేఘాలయ (76.00%), మణిపూర్ (74.34%) నాగాలాండ్ (73.90%) రాష్ట్రాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 33% భూభాగం అడవులో నిండి ఉందని అధ్యయనం తేల్చింది. మడ అడవుల విస్తీర్ణంలో దేశంలో స్వల్పంగా 17 చ.కి.మీ మేర పెరిగి, మొత్తం 4,992 చ.కి.మీ మేర మడ అడవులున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి రూపొందించిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, 2021’ను కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ.. దేశంలో అటవీ భూభాగం 80.9 మిలయన్ హెక్టార్లు, అంటే దేశ భూభాగంలో 24.62 శాతం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. 2019తో పోల్చితే అటవీ విస్తీర్ణం పెరిగిందని, అయితే కేవలం అడవులను పరిరక్షించడంతోనే తాము సరిపెట్టడం లేదని, వాటిని పరిపుష్టం చేసేందుకు కూడా చర్యలు చేపట్టామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement