తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని కొడైకెనాల్ కొండల సమీపంలోని అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. పెరిమల్మలై శిఖరంపై ఈ మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. మంజూర్ అటవీ ప్రాంతంలో తొలుత నిన్న అర్ధరాత్రి మొదలైన మంటలు శుక్రవారం ఉదయం నుంచి మైలడంపరాయి, కురుసాడి అటవీ ప్రాంతానికి వ్యాపించాయి. సంఘటనా స్థలం నుండి ఒక వీడియోను ANI వార్తా సంస్థ షేర్ చేసింది.
40 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో అడవిలో మంటలు చెలరేగుతున్నాయని, పెద్ద ఎత్తున పొగలు వ్యాపించిన దృశ్యం కనిపిస్తోంది. వీలైనంత త్వరగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు. కాగా, అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులను రక్షించడానికి.. మంటలను ఆర్పేందకు హెలికాప్టర్లను మోహరించాలనే డిమాండ్లు వస్తున్నాయి.