Friday, November 22, 2024

Special Story : ఆ ఇద్ద‌రి కోసం… ఈ ఇద్ద‌రు…

- Advertisement -

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలోనే కాదు..దేశ రాజకీయాల్లోనే.. వైఎస్‌ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి నాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేపట్టి దేశ రాజకీయాలను ఏపీ వైపు చూసేలా చేశారు. అదే తరహాలో ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను విభేదించి రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేసి తండ్రి తరహాలోనే ప్రజా సంకల్ప పాదయాత్ర చేప ట్టి తాను స్థాపించిన వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. పట్టుదలలోనూ.. అనుకున్నది సాధించే విషయంలోనూ.. ఇద్దరిదీ ఒకటే శైలి..ఒకే విధానం అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు వైఎస్‌ కుటుంబానికి వీర విధేయుడిగా, నమ్మిన బంటుగా ఆ ఇద్దరిదే.. కీలక పాత్ర అని చెప్పక తప్పదు. నాడు వైఎస్సార్‌ కోసం కె.వి.పి రామచంద్రరావు ఆయన వెన్నంటే నడిచారు. కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా ఎన్నడూ వైఎస్‌కు దూరం కాలేదు. ఆయన అడుగులో అడుగు వేస్తూ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ సలహా దారులుగా కీలక పాత్ర పోషించారు.

వైఎస్‌ విపక్ష నేతగా, సీఎంగా ఉన్న సమయంలో ఇటు పార్టీ పరమైన అంశాల్లోనూ.. అటు ప్రభుత్వ పరమైన విధివిధానాల్లోనూ కీలకంగా వ్యవహరించి వైఎస్‌కు 24 గంటలు సేవలందిస్తూ వచ్చారు. అందుకే వైఎస్‌ సైతం కె.వి.పి నా ఆత్మ లాంటి వారని గతంలో అనేక సందర్భాల్లో రామచంద్రరావు సేవలను కొనియాడుతూ కితాబు కూడా ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు తెర వెనుక వైఎస్‌కు ఎన్నో సలహాలు ఇవ్వడంతో పాటు సమస్యలు వచ్చినప్పుడు ఆయన వరకు వెళ్లకుండా స్వయంగా కె.వి.పినే రంగంలోకి దిగి వాటిని అక్కడికక్కడే పరిష్కరించేవారు. ప్రస్తుతం సజ్జల కూడా సీఎం జగన్‌కు ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందిస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్‌ అభిమానుల్లో ఎవరి నోట విన్నా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది

కాంగ్రెస్‌ ప్రభుత్వంఅధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర కె.వి.పి హవా సాగింది. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ పార్టీ నాయకులకు ఏ చిన్న పని కావాలన్నా కె.వి.పిని సంప్రదిస్తే క్షణాల్లో వారి పనిని పూర్తి చేసి శభాష్‌ అనిపించుకునేవారు. చాలా వరకు సమస్యలను వైఎస్సార్‌ వరకు వెళ్లనీయకుండా ఆయన పరిధిలోనే పరిష్కారం చేసి సందర్భం వచ్చిన సమయంలో వైఎస్‌ చెవిలో చెప్పేవారు. అందుకే కె.వి.పి అంటే వైఎస్‌కు అంత అభిమానం. ఏ విషయంలో అయినా ఆయన చెప్పిన సలహాను వైఎస్‌ పాటించేవారు. వారిద్దరి మధ్య మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ పయణం సాగింది. ఏరోజు కూడా పార్టీ వ్యవహారా ల్లోగాని, ప్రభుత్వ విషయంలో ఆయన మితిమీరిన జోక్యం చేసుకున్న సందర్భాలు ఉండేవి కావు.

అందుకే కె.వి.పిపై మరింత నమ్మకంతో రాజశేఖర్‌రెడ్డి అత్యంత కీలకమైన అంశాలను కూడా ఆయనతోనే చర్చించేవారు. ఈ నేపధ్యంలోనే రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కె.వి.పిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. రాజశే ఖర్‌ రెడ్డి కుటుంబం కోసం, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం కె.వి.పి నిస్వార్ధంగా పనిచేశారు. ఎంతో మంది నాయకులకు తన నోటి మాటతో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవులను ఇప్పించిన ఆయన తన రాజ్యసభ పదవి కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూసి కాంగ్రెస్‌లో సమర్ధుడైన నాయకుడిగా, వైఎస్సార్‌కు వీర విధేయుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఏ పదవి లేని సమయంలో కూడా వైఎస్సార్‌కు కోసం రోజుకు 18 గంటలకు పైగా తెర వెనుక ఉండి పనిచేసే వారు. అవసరమైన సందర్భంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై సమన్వయం చేసుకునేవారు.

అలా కె.వి.పి, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడిలా, ఆత్మలా మారారు. ఈరోజుకు కూడా కె.వి.పి పేరు వినపడగానే వైఎస్సార్‌ ఆత్మ అనే పదం నాటి తరం నేతల నుండి.. నేటి తరం నేతల వరకు గుర్తుకు చేసుకుంటూనే ఉన్నారంటే వైఎస్‌ కుటుంబానికి ఆయన ఎంత విశ్వాసంగా పనిచేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

సజ్జల గుండె నిండా..జగనే
కె.వి.పికి, సజ్జలకు..ఇద్దరికీ చాలా దగ్గర సంబం ధాలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. నాడు వైఎస్సార్‌కు కె.వి.పి ఎలా అండగా నిలిచారో..అంతకు మించి రెండింతలు నేడు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్‌కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ లోనూ.. ప్రభుత్వంలోనూ సజ్జలే కీలకంగా మారారు. ఏ సమస్య వచ్చినా సీఎం జగన్‌ పరిష్కార బాధ్యత లను సజ్జలకే అప్పగిస్తున్నారంటే ఆయనపై ఎంత నమ్మకం ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్‌ పాదయాత్ర సమయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.


2014 నుండి 2019 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం వైసీపీ అధికారం లోకి వచ్చాక గడిచిన ఐదేళ్లలోనూ అనేక సమస్యలను ఆయన ఓ సవాల్‌గా తీసుకుని ప్రభుత్వానికి.. పార్టీకి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా సీఎం జగన్‌ సూచనలు, సలహాల మేరకు వాటిని పరిష్కరి స్తూ వస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు, ఆయా సంఘాల ఆందోళనలు వంటి సంఘటనలు చోటుచేసుకున్న సందర్భంలోనూ అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు ప్రభుత్వ ప్రతిష్టకు ఎక్కడా భంగం తలెత్తకుండా ఉద్యోగులకు నచ్చ చెబుతూ సమస్యను సున్నితంగా పరిష్కరించే ప్రయ త్నాలు సజ్జల చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎంతో మందికి కీలకమైన పదవులతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన పోస్టులను ఇప్పిం చడంతో ముం దుంటున్న సజ్జల ఏరోజు కూడా తనకు పదవి కావాలని అడిగింది..లేదు.. వాటిపై వ్యామో యం పెంచు కోని గొప్ప నేత సజ్జల..

పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌ మాటే వేదంగా వైసీపీ బలోపేతమే లక్ష్యంగా వైఎస్‌ కుటుంబానికి తన వంతు అండగా నిలుస్తున్న సజ్జల, సీఎం జగన్‌పై ఈగ వాలనివ్వ కుండా కంటికి రెప్పలా కాపాడుకోవడంలో ఆయన కు ఆయనే సాటి.. విపక్షాలు జగన్‌పై విమర్శలు చేస్తే ప్రతి విమర్శలుగా మాటల యుద్ధంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ వంటి బలమైన నేతల నోర్లు మూ యించేలా ఎక్కడి కక్కడ కౌంటర్లు ఇస్తున్నారు. నిత్యం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందు బాటులో ఉంటూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో సజ్జల ముందుంటున్నారు.

ఈ నేపధ్యంలోనే సజ్జల అంటే జగన్‌కు కూడా మరింత నమ్మకం, భరోసా పెరుగుతూ వస్తోంది. కీలకమైన సందర్భాల్లోనూ, సున్నితమైన సమస్య లను పరిష్కరించే బాధ్యతలను కూడా అనేక సందర్భాల్లో సజ్జలకే అప్పగిస్తున్నారంటే సీఎం జగన్‌ కు ఆయనపై ఎంత నమ్మకం ఉందో, ఆ దిశగా సజ్జల కూడా ఎంత నమ్మకాన్ని తెచ్చుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement