న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కన్నబిడ్డను తల్లికి అప్పగించాలని సహజ న్యాయసూత్రం చెబుతోంది. కానీ ఆ తల్లి నివసించే ప్రాంతంలో ఎప్పుడు ఏ మిస్సైల్ మీదపడి బలితీసుకుంటుందో తెలియని యుద్ధక్షేత్రం. దీంతో ఆ న్యాయస్థానం బిడ్డను తల్లికి వెంటనే అప్పగించలేక.. అలాగని కాదనలేక ఓ సంకటస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీ హైకోర్టులో ఈ విచిత్ర పరిస్థితి ఆవిష్కృతమైంది. లక్షలాది మందిని కట్టుబట్టలతో ఇల్లు వదిలి దేశవిదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లేలా చేసిన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఓ మహిళ జీవితానికి ఎన్నో విధాలుగా శాపంగా మారింది. ఉక్రెయిన్‌కు చెందిన స్నిజానా గ్రైగోరివ్నా, భారతీయుడైన అఖిలేశ్ కుమార్ గుప్తా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
2000 సంవత్సరంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఉక్రెయిన్‌లోనే కాపురం పెట్టారు. 2002లో పాప పుట్టింది. పాప వికా (విక్టోరియా) గుప్తా పుట్టిన చాలా కాలం తర్వాత రెండో సంతానంగా బాబు పుట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు దంపతుల మధ్య విబేధాలు తలెత్తాయి. ఉక్రెయిన్ చట్టాల ప్రకారం అక్కడి న్యాయస్థానంలో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. పిల్లలిద్దరినీ తల్లి సంరక్షణలోనే ఉంచాలంటూ ఉక్రెయిన్ కోర్టు డిక్రీ ఇచ్చింది. అయితే తండ్రి పిల్లలను చూసి వెళ్లడానికి మాత్రం అనుమతించింది. ఆ ప్రకారం వీలు చిక్కినప్పుడల్లా అఖిలేశ్ గుప్తా తన పిల్లలిద్దరినీ చూసి వెళ్తుండేవారు.
దూరం చేసిన యుద్ధం
విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు గడుపుతున్న సమయంలో ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కొత్త సమస్యను సృష్టించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. అక్కడ చిక్కున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో పాస్‌పోర్ట్, వీసా తదితర సరైన ధృవపత్రాలు లేకపోయినా.. యుద్ధభూమి నుంచి స్వదేశానికి తీసుకొచ్చే క్రమంలో భారత ప్రభుత్వం తాత్కాలిక పత్రాలను జారీ చేసి మరీ వెనక్కి తీసుకొచ్చింది.
సరిగ్గా ఇదే అఖిలేశ్ గుప్తాకు అవకాశాన్ని సృష్టించింది. పిల్లల్ని చూసే వంకతో స్నిజానా ఇంటికి వెళ్లిన అఖిలేశ్, బాబును తీసుకుని కాసేపు వాకింగ్ చేస్తానంటూ బయటికి తీసుకొచ్చాడు. అంతే.. అటు నుంచి అటే మూడేళ్ల చిన్నారితో ఉక్రెయిన్ – రొమేనియా సరిహద్దులకు చేరుకున్నాడు. తన భార్య, ఇతర కుటుంబ సభ్యులు యుద్ధంలో చనిపోయారని, తాను, మూడేళ్ల చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డామని అక్కడున్న భారత రాయబార కార్యాలయ సిబ్బందితో చెప్పాడు. మొత్తంగా అక్కడి అధికారులకు కట్టుకథలు చెప్పి కొడుకుతో పాటు భారత్ చేరుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ నెంబర్లు మార్చేసి భార్యకు, కూతురుకు దొరక్కుండా భారత్‌లో తప్పించుకుతిరిగాడు. కొడుకు కోసం స్నిజానా చేయని ప్రయత్నం లేదు. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నా.. అక్కడున్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లి అధికారుల సహాయం కోరింది. కానీ ఎవరి నుంచీ సహాయం దొరకలేదు.
ఆమెకు పోరాటానికి స్నేహితులు లిదియా లక్ష్మి చేయూతనిచ్చారు. భారతీయ లలిత కళలతో పాటు భారతీయ భాషలు నేర్చుకుంటున్న ఉక్రెయిన్ జాతీయురాలైన లిదియా లక్ష్మి, తాను చూసిన సినిమా ‘జై భీమ్’ నుంచి స్ఫూర్తి పొంది ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేయాలని భావించారు. ఇద్దరూ కలిసి భారత్‌లో అనేక మంది న్యాయవాదులను సంప్రదించారు. ఎవరూ ముందుకురాకపోగా.. ఓ తెలుగు న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆమె తరఫున ‘హెబియస్ కార్పస్’ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అఖిలేశ్ గుప్తాను, అతని దగ్గరున్న మూడేళ్ల చిన్నారి ఆచూకీని కనిపెట్టారు.
నవంబర్ 14న జరిగిన విచారణ సందర్భంగా తండ్రి అఖిలేశ్‌ను కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆ సమయంలో కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని, అందుకే కోర్టుకు తీసుకురాలేదని, తదుపరి వాయిదాకు తీసుకొస్తానని అఖిలేశ్ చెప్పారు. ఈ విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన స్నిజానా, అనువాదకుడి సహాయంతో కొడుకు యోగక్షేమాలపై ఆరా తీసింది. తన బిడ్డను తనకు అప్పగించాలని హైకోర్టును వేడుకుంది. మరోవైపు మిస్సైళ్ల వర్షం నుంచి తప్పించుకుంటూ పోలండ్ మీదుగా కూతురితో కలిసి స్నిజానా ఢిల్లీ చేరుకుంది.
మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు హాజరైన స్నిజానా తన కొడుకును చూడగానే భావోద్వేగానికి గురైంది. కొన్ని నెలలకు పైగా మూడేళ్ల చిన్నారికి దూరంగా ఆమె అనుభవించిన మానసిక క్షోభ అంతా ఆమెకు గుర్తుకొచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిస్తూ తల్లి తన కొడుకును కలిసేందుకు అనుమతించింది. హైకోర్టు ప్రాంగణంలోని చిన్నారుల సంరక్షణ కేంద్రం వద్ద సాయంత్రం గం. 4.00 వరకు కొడుకును కలిసింది. ఈ 6 నెలల దూరంతో ఆ చిన్నారి తొలుత తల్లి దగ్గరకు వెళ్లేందుకు కాస్త తటపటాయించినా, ఆ తర్వాత గుర్తుపట్టి హాయిగా ఆడుకున్నాడు. బుధవారం జరిగే విచారణ సందర్భంగా హైకోర్టు చిన్నారి సంరక్షణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఏ దేశపు చట్టం ప్రకారమైనా ఏడేళ్ల లోపు చిన్నారులను తల్లి సంరక్షణలోనే ఉంచాలి. పైగా ఉక్రెయిన్ కోర్టు ప్రకారం ఆ చిన్నారి తల్లి దగ్గరే ఉండాలన్న డిక్రీ కూడా ఉంది. అఖిలేశ్ తన తరఫున కౌంటర్ వాదనలు వినిపించినప్పటికీ.. హైకోర్టు చిన్నారిని తల్లికి అప్పగించడానికి పెద్దగా అడ్డంకులేవీ కనిపించడం లేదు. కానీ హైకోర్టు ముందున్న ప్రశ్న ఇప్పటికిప్పుడు తల్లికి అప్పగించి ఉక్రెయిన్ పంపించడం అంటే.. నేరుగా రణరంగంలోకి పంపి ఆ చిన్నారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది. కానీ న్యాయస్థానం ఈ కేసును మనసుతో చూస్తుందా లేక చట్టం, సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఆదేశాలిస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.