Sunday, November 24, 2024

Big Story: విశ్వశాంతి కోసమే, సీతారాముల కల్యాణం – అన్యోన్య దాంపత్యానికి వారే ఆదర్శం

లోకానికి మంగళ శుభాలను కలిగించే కర్మ కల్యాణం. విశ్వశాంతి కలగాలంటే కుటుంబవ్యవస్థ బాగుండాలి.. భార్యాభర్తలు కూడా అన్నోన్యంగా ఉండాలి. దేశ వ్యవస్థ కుటుంబంపై ఆధారపడి ఉంది. అటువంటి కుటుంబ వ్యవస్థలో అన్నోన్య దంపతుల జంటకు సీతారాములే ఆదర్శం. సీతారాముల దాంపత్యం వల్ల విశ్వశాంతి కలుగుతుందని పెద్దల విశ్వాసం. అన్ని కళ్యాణాలకంటే శ్రీసీతారాముల కళ్యాణాన్ని అనుసరించి శ్రీరామనవమినాడే భద్రాచలంలో శ్రీరాముని పుట్టిన రోజు శ్రీసీతారామ చంద్రస్వామి కళ్యాణం జరపాలని ఆగమ శాస్త్రం చెప్పిన విశేషమైన అంశం. భద్రాచలంలో ఆగమ శాస్త్రం అనుసరించి కళ్యాణం చేయడం ఆనాడు భక్త రామదాసు ప్రారంభించారు.

ప్రభన్యూస్‌ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం : రామదాసు గురువైన రఘునాధ్‌ భట్టార్‌ నిర్ణయం మేరకు ప్రతి ఏడాది భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రస్వామి కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఆయన వల్లే భక్తరామదాసు మంత్రోపదేశం. రామభక్తిని పొందారు. ఆగురువు చేసిన నిర్ణయం ప్రకారం పంచారాత్ర ఆగమ శాస్త్రం అనుసారంగా శ్రీరామనవమిని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ కార్యక్రమం 50 ఏండ్లుగా నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ నవమిని నిర్ణయించడానికి క్లిష్టమైన నిర్ణయం తీసుకుంటారు. శాస్త్రాలను పరిశీలించి నవమి నిర్ణయించడం జరుగుతుంది. శ్రీరామనవమిని నిర్ణయిచేటప్పుడు పంచరాత్ర ఆగమాన్ని, శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని ప్రధానమైన ప్రామాణికంగా తీసుకుని భద్రాచలంలో సీతారామ చంద్రస్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఏనాడు జరుగుతుందో ఆనాడే దేశవ్యాప్తంగా జరుపుకోవాలని ప్రామాణికమైన పద్దతి భద్రాచలం క్షేత్రంలోనే ఉంది. ప్రామాణికమైన పద్దతిని భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమిని వ్రతంగా ఉపవాసంగా ఆచరించేవారు.

ఆనాడు ఆచరించిన సీతారాముల కళ్యాణం భద్రాచల క్షేత్రంను బట్టే నిర్ణయించాలని పెద్దలు ని ర్ణయించారు. భద్రాచలం క్షేత్రానికి విశిష్ట స్థానం ఉంది. భారతదేశంలో ఎన్ని మతాలు, సాంప్రదాయాలు ఉన్నా హిందూ ధర్మానిీకి సంబందించిన వారు ఆరాధించే ఏకైక దైవం శ్రీరాముడే. శ్రీరామ చంద్రుని ప్రధాన క్షేత్రాలు రెండు ఉండగా ఉత్తర భారతదేశంలో అయోధ్య, దక్షిణ భారతదేశంలో భద్రాచలంలో ఉన్నప్పటికి భద్రాచలంరాముడి కళ్యాణానికి ప్రసిద్ది . రాష్ట్రంలో వైష్ణవ ఆలయాలలో చేసే కళ్యాణ విధానం భద్రాచలం క్షేత్రాన్ని బట్టే రూపొందించుకున్నారు. అంత గొప్ప విధానంతో అత్యంత వైభవంతంగా భద్రాచల క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. రాజ్యాంగం ప్రకారం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ప్రతియేటా స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, మంగళసూత్రాలను అందించడం ఆనాటి నిజాం ప్రభువు తానీషా కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. వైదిక విధానం ప్రకారం పంచమ ఆగమ శాస్త్రం చెప్పిన విధంగా శ్రీవైష్ణవ సాంప్రదాయానికి అనుగుణంగా స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ ం మరునాడే స్వామి వారికి పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మిథిలా కళ్యాణ మండపానికి శిల్పకళా శోభ
శ్రీరామ దివ్యక్షేత్రంలోని మిధిలా కళ్యాణ మండపం శిల్పకళ శోభతో రూపుదిద్దుకుంది. అయోధ్యాపురి రామయ్య, సుగుణాల రాశి సీతమ్మను భద్రాద్రి మిథిలాపురి కళ్యాణ మండపంలో కళ్యాణమాడనున్నారు. ఇది లోక కళ్యాణం కావడంతో దీనిని తిలకించేందుకు భక్తజన కోటి భద్రాద్రికి చేరుకోనుంది. భద్రాచలంలో స్వామి వారి పెళ్ళి అయ్యాకే దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కళ్యాణం మొదలుపెట్టడం ఆనవాయితీ 1964 వరకు సీతారాముల కళ్యాణం రామాలయంలోనే ఉత్తర ద్వారంలో నిర్వహించేవారు. అప్పటి ప్రభుత్వం 1960లో మిధిలా స్టేడియంలో కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టగా అది 1964లో పూర్తయింది. తమిళనాడు రాష్ట్రం నుండి తెప్పించిన ప్రత్యేక రాయితో ప్రముఖ శిల్పకళాకారుడు గణపతి స్థపతి దీనిని సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ శిల్పసంపద వైభవాలకు ప్రతీక. వివిధ భుజాలు కలిగిన విశ్వక్షేణుడి పూజలు సూక్ష్మమైన ఆంజనేయ స్వామి విగ్రహం, విగ్రహం తోకమడ సన్నటి పుల్ల తిరుగుతూ కనిపిస్తుంది. మండపం పైన ధనరాసులు, సురలు, నరులు, మునులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వైభవం, సింహంనోట్లోనుండి తిప్పితే గలగల తిరిగే రాయి, ఆలయ స్థంబంపై సుదర్శనచక్రం, గొలుసు ఇవన్నీ ఒకే రాయితో చెక్కి శోభితంగా తీర్చిదిద్దారు. ప్రతి శిల్పం ఇక్కడ ఓ అధ్బుత ఘటన అందుకే శిల్పకళాస్వరూపమైన ఈ మండపంలో నిర్వహించే సీతారాముల కళ్యాణానికి అంతటి ప్రతిష్ట ఉంది.

రామాలయ నిర్మాణంలో భక్తరామదాసు పాత్ర…
భక్తరామదాసుగా ప్రసిద్ది గాంచిన కంచర్లగోపన్న మహాభక్తుడు. గోల్కొండ నవాబైన తానీషా దగ్గర మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నల మేనల్లుడే ఈ కంచర్ల గోపన్న. మేనమామల చలువతో తానీషా ప్రభువు రామదాసును పాల్వంచ పరిగణా తహశీల్దార్‌గా నియమించారు. 1670లో హస్నాబాద్‌ సంస్థానంలోని పాల్వంచ పరిగణా తహశీల్దార్‌గా వచ్చినసమయంలో గోదావరి నదితీరాన్ని దర్శించిన రామదాసుకు పోకల దమ్మక్క తారసపడి మహాదేవుడైన శ్రీరామ చంద్రునికి నిలువనీడలేని చెప్పింది. వనవాసం అయిపోయనా కూడా వనవాసం అనుభవిస్తున్న దేవాది దేవుడికి గుడికట్టించే ఏర్పాట్లు చేయమని కోరింది. మహాభక్తుడైన భక్తరామదాసు శిస్తు వసూళ్ళద్వారా వచ్చిన 6లక్షల ప్రభుత్వ ధనంతో 1674లో రామాలయ నిర్మాణం చేశాడు. దీంతో కోపించిన తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించాడు. కారాగార వాసంలో దెబ్బలకు ఓర్వలేకపోయే పరిస్థితిలో కూడా రామనామాన్ని వీడలేదు. ఆసమయంలో రామోజీ, లక్ష్మోజి అనే పేరుతో తానీషా కలలోకి వచ్చి 6లక్షల వరహాలను చెల్లించి తరింపచేశారు. శ్రీరామ సాక్షాత్కారం పొందిన తానీషా పరవశుడై రామదాసును బంధించినందుకు పశ్చాత్తాపం చెంది రామదాసును విడుదల చేశాడు. అంతేకాకుండా రామయ్యకు సేవ చేస్తానని ఆనాటి నుండి స్వామివారి కళ్యాణానికి తానుకూడా ఉడతా భక్తిగా ప్రభుత్వ తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రతి సంవత్సరం పంపే విధంగా శాసనం చేసి ఆయనే స్వయంగా స్వామివారి కళ్యాణానికి విచ్చేసి మత సామరస్యానికి నాంది పలికారు. ఆ శాసనం ప్రకారం ఈనాటికి ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం ద్వారా అందించడం ఆనవాయితీగా వస్తుంది.

- Advertisement -

శ్రీరామ దివ్యక్షేత్రానికి ప్రత్యేక విశిష్టత
దేశంలోనే పేరుపొందిన 25 శ్రీరామ దివ్య క్షేత్రాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయ దర్శనంతో సర్వపాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మిక. పితృవాక్య పరిపాలన, ధర్మాచరణం ఒకేబాణం, ఏకపత్నీ వ్రతుడు అనే విశిష్టగుణములు శ్రీరాముడి పరమార్ధ తత్వాలు అందుచేతనే జనులందరికి ఆదర్శమయ్యాడు జగమేలే జగదభి రాముడు. శివునికి సైతం శ్రీరామనామం తారకమంత్రం అయిందంటే ఈ నామానికి ఎంతటి విశిష్టత ఉందో అర్ధం చేసుకోవచ్చు. భద్రగిరి చుట్టూ పవిత్రగోదావరి ప్రదక్షణ చేస్తూ, పాపికొండల్లో కలవడం ఈ క్షేత్రంలో మరో విశేషం. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడై వన వాసం చేయడానికి భద్రాచలం వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. భద్రుని తపస్సుకు మెచ్చి కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం ధరించి శ్రీరాముడు భద్రునికి దర్శనమివ్వగా ఇదే రూపంతో సీతా, లక్ష్మణుడితో సహా తన శిరస్సుపై నివశించమని భద్రుడు కోరినట్లు . . . అందుకు శ్రీరాముడి అంగీకరించి ఇక్కడ కొలువు కావడంతో ఈ ప్రాంతానికి భద్రాచలం అని పేరొచ్చింది. భద్రాచలంలో కొలువున్న శ్రీరామ చంద్రుడు . . .చతుర్భుజ రాముడని, మోక్ష ప్రదాయుడని, జ్ఞాన ప్రదాయుడని, భద్రగిరి నారాయణుడని, రామనారాయణుడని ఇక్కడ పిలువబడుతున్నాడు.

విశ్వవిఖ్యాతం….శ్రీరామ దివ్యక్షేత్రం
ప్రపంచ దేశాలకు ఆచార్య పీఠం భారత దేశమైతే విశ్వవిఖ్యాత పుణ్యతీర్ధం భద్రాద్రి శ్రీరామ దివ్య క్షేత్రం.ఎందరో మహామహులు భద్రాద్రి మహత్యాన్ని వేయినోళ్ళ కొనియాడారు. భద్రాద్రికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. అంతకన్నా మిక్కిలి స్థల పురాణం మహాప్రాసశ్యమైనది. ఆనాటి మహానగరాలైన అయోధ్య, మిధిలా నగరాలతో సమానమైన కీర్తిని గడిం చిన భద్రాద్రి దక్షిణ భారత దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతుంది. వెంకటాచలం, వేదాచలం, సింహాచలం, యాదాద్రి, రత్నాద్రి, మంగళాద్రి, భద్రాద్రి ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎందరెందరో మహా భక్తుల పేర్లతో వెలసి భారతావని ని నలువైపులా పునీతం చేస్తున్నాయి. భద్రాచలం క్షేత్ర సందర్శనం పవిత్రగోదావరి నదీ స్నానం, శ్రీరామ చంద్రుని సేవాభాగ్యం ముల్లోకాలలో సైతం దుర్లభమని మహాత్ములు వర్ణించారు. వేలకొలది సంవత్సరాలు భద్ర మహర్షి తపస్సు చేసింది ఇక్కడే. దక్షిణ గంగగా ప్రసిద్ది గాంచిన పావన గౌతమీనది ప్రవహిస్తున్నది ఇక్కడే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుండి దిగివచ్చి రామనారాయణుడై కొలువున్నది ఇక్కడే.

భద్రాద్రి క్షేత్ర ఆవిర్భావంలో భద్రమహార్షి పాత్ర
భద్రాచల క్షేత్రావిర్భావానికి మూల పురుషుడు భద్ర మహర్శి. అందుకే ఈ క్షేత్రం ఆమహర్షి పేరుమీదుగా భద్రాచలం అని పిలువబడుతుంది. ఈ క్షేత్రకథ బ్రహ్మపురాణంలో వివరించబడింది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం సమయంలో వనవిహారానికి బయలుదేరి భద్రాచల ప్రాంతానికి కాలినడకన చేరుకున్నారు. ఆసమయంలో నీలి కలువల్లాంటి సీతమ్మ పాదాలు ఎరుపెక్కాయి. సీతమ్మతల్లి లేత చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. అరికాళ్ళు ఎర్ర తామరయయ్యాయి. శిరీషకుసుమకోమలి సీతను చూసి శ్రీరాముడు చలించిపోయాడు. కరుణా సముద్రుడైన రాఘవుడు ప్రేమైక మూర్తి సీతమ్మను మెల్లగా ఒక శిల చెంతకు తీసుకువచ్చాడు. ఇద్దరూ ఆశిలపై కూర్చొని సేద తీరారు. వైకుంఠంలో ఆదిశేషుడు తన అనువనువు అర్పించుకుని గొడుగై, మృదు తల్పమై, ఆసనమై,ఉయ్యాలై, పాదపీఠమై ఆఫణిరాజు వారికి ఎంత సౌఖ్యాన్ని అందిస్తూ సేవిస్తాడో ఆశిలకూడా సీతారాములకు అంత సౌఖ్యాన్నిచ్చింది. కోటి చంద్రకాంత శిలలైన ఇంత చల్లదనాన్నిచ్చేనా, ఇంత సౌఖ్యాన్ని కలుగజేసేనా అని ఆ జగన్మాత సీతమ్మ హృదయం ప్రేమతో పొంగి పోయింది. అప్పుడు ఆమె శ్రీరామ చంద్రుడితో స్వామీ. . . ఈ శిలకు వరాన్ని ప్రసాదించండి అని కోరింది. ఆ సమయంలో రామయ్య కన్నులలో కరుణా సముద్రాలు పొంగాయి. ఓ శిలరాజమా నీవు మేరు పర్వతరాజు పుత్రుడవై జన్మించి భద్రుడు అనే పేరుతో సకల సద్గుణాలతో వర్ధిల్లుతావు మహా తపోధనుడవై, నా భక్తుడవై నన్ను నీ శిరమున ధరిస్తావు, కలియుగ మానవాళిని ఉద్దరిస్తావు విజయోస్తు అని దీవించాడు. ఇలా త్రేతాయుగంలోనే భద్రాచల క్షేత్రావిర్భావానికి అంకురార్పణ జరిగింది. సీతారాముల సంకల్పమే ఈ పుణ్యతీర్ధ స్థలానికి పూర్వరంగ మై వెలసిల్లింది. ఈ భద్రాచల మహత్యం అమోఘం.

Advertisement

తాజా వార్తలు

Advertisement