గత రెండు వారాలుగా ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి..పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా 10,093 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. .కాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57,542కు చేరుకుంది. అలాగే, మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 19 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం మణాలు సంఖ్య 531114కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదిలావుండగా, కోవిడ్-19 తో ఇప్పటివరకు 44229459 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది. అలాగే, మరణాలు రేటు 1.19 శాతంగా ఉంది. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 220,66,26,324 డోసులను అందించారు.
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, ప్రస్తుత పరిస్థితులను అదుపులో ఉంచడానికి, కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. మరో 10-12 రోజుల పాటు కేసులు పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫెక్షన్ ప్రస్తుతం అంటువ్యాధి దశలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అంటువ్యాధి దశలో, సంక్రమణ ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయబడుతుందని పేర్కొన్నాయి.తెలంగాణలో కొత్తగా 31 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 8,42,932 కు చేరుకుంది. కొత్త మరణాలు నమోదు కాకపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,111గా ఉంది. కొత్తగా 31 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 8,38,574 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.