హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : హ్యాట్రిక్ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న భారత రాష్ట్రసమితి (బీఆర్‌ఎస్) త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. మూడోసారి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవడమే ధ్యేయంగా పార్టీ యంత్రాంగ మంతా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో పనిచేసే విధంగా ఈ సారి యువనేత, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్ట డంతో, ఆయన మార్గదర్శకాల మేరకు వ్యూహకర్తగా కేటీఆర్ ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలు స్తోంది. అయితే, గతంలో వలె కాకుండా ఈ సారి ఎన్నికల్లో యువజన ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతుబంధు, పెన్షన్లు, ఇళ్ళ పట్టాలు, పోడు పట్టాలు, దళిత బంధు, కుల వృత్తుల ప్రోత్సాహకాలు.. లాంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య దాదాపు కోటికి చేరువలో ఉన్నారు. ఈ ఓట్లు ఎలాగూ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కే వస్తాయన్న ధీమా పార్టీ వర్గాల్లో గట్టిగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో కీలకమైన యువజనుల ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ కార్యాచరణ మొదలు పెట్టింది. అందులో భాగంగా వచ్చే నెల మొదలుకుని ప్రత్యేకంగా విద్యార్థి, యువజనులను ఆకర్షించేందుకు పార్టీ సమాయత్తమవుతోంది. అందుకోసం విద్యాసంస్థల్లో విద్యార్థి సమ్మేళనాలు, గ్రామాల్లో, వీధుల్లో, బస్తీల్లో యువ సమ్మేళనాలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం పార్టీ కొత్త మార్గదర్శకాలువిడుదల చేయనుంది. కేవలం విద్యార్థులు, యువజనుల నుంచి పది లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళిక రచిస్తున్నారు. అందుకోసం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకో లక్ష చొప్పున టార్గెట్ విధించి బీఆర్‌ఎస్ యువ మంత్రం విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. జూన్ రెండవ వారం నుంచి ఈ కార్యాచరణ అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మెగా యూత్ మెంబర్‌షిప్ డ్రైవ్..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 9 సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు కార్యనిర్వహక అధ్యక్షుడు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలకు ఇఆక కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో క్షేత్ర స్థాయిలో పార్టీపరంగా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు ప్రతీ నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. త్వరలోనే యువత కోసం కూడా ప్రత్యేక సమ్మేళనాలు ఏర్పాటు- చేయనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మంది రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. కాగా, వీరిలో 35 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీరితో పోలిస్తే 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు 25 శాతం తక్కువగా ఉన్నారు. పార్టీ పరంగా ఈ ఏజ్ గ్రూప్ సభ్యత్వాలను పెంచాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అధినేత సూచనల మేరకు త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ మెగా యూత్ మెంబర్‌షిప్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం పార్టీ పరంగా అన్ని స్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు రంగం సిద్ధం చేస్తున్నారు.
అవతరణ వేడుకలకు అత్యధిక ప్రాధాన్యత
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం, పార్టీ పరంగా నిర్వహించనున్నారు. 21 రోజుల పాటు- జరుగనున్న ఈ సంబరాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలు విజయవంతం చేయడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అందుకే.. ఉత్సవాలు ముగిసిన అనంతరం మెగా యూత్ మెంబర్‌షిప్ డ్రైవ్ చేపట్టాలని పార్టీ భావిస్తోంది. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో ఈ మెగా యూత్ డ్రైవ్ ప్రారంభం కానున్నట్లు- పార్టీ వర్గాలు తెలిపాయి.
వివాద రహితులకే ప్రాధాన్యత, బాద్యతలు
జిల్లాలు, నియోజకవర్గాల్లో వివాదరహిత యువతకు ప్రాధాన్యత ఇస్తూ.. వారికే బాద్యతలు అప్పగించనున్నారు. ప్రతిపక్ష భాజపా, కాంగ్రెస్ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చర్చకు పెడుతున్నారు. వివాదాలు లేని నియోజకవర్గాల్లోని అభ్యర్థులను ఖరారు చేస్తూ, వారిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇటీ-వల కేటీ-ఆర్ జిల్లా పర్యటనలు ఎక్కువగా చేపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో కౌశిక్‌రెడ్డిని గెలిపించుకోవాలంటూ కేటీ-ఆర్ పిలుపునిచ్చారు. అలాగే హుస్నాబాద్ సభలో మాజీ ఎంపీ వినోద్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి అని, బండి సంజయ్‌ను ఇంటికి పంపి వినోద్‌ను గెలిపించాలని కేటీ-ఆర్ పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కేటీ-ఆర్ కోరారు. వరంగల్‌లో వినయ్ భాస్కర్, కామారెడ్డి జిల్లా జక్కల్‌లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే విషయంలోనూ కేటీ-ఆర్ ఇదే విధంగా ప్రకటనలు చేశారు.
కేటీఆర్ వ్యూహంపై జోరుగా చర్చ
కేటీ-ఆర్ జిల్లా పర్యటనల్లో అనుసరిస్తున్న వ్యూహంపై ఇప్పటికే జోరుగా చర్చ మొదలైంది. కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తుండడంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేటీ–ఆర్ మౌనంగా ఉండడంతో, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ దక్కడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. రామగుండం ఎమ్మెల్యే చందర్ గురించి మాట్లాడిన కేటీ-ఆర్ చందర్ మంచి యువకుడు అని, బాగా కష్టపడతాడని, ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నాడని, ఏవైనా చిన్నచిన్న పొరపాట్లు- ఉంటే మన బిడ్డ అనుకుని కడుపులో పెట్టుకోవాలని కేటీ-ఆర్ అన్నారు. కానీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను మరోసారి గెలిపించుకోవాలని చెప్పకపోవడంతో, ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఇక పెద్దపల్లి ఎంపీ బార్లకుంట వెంకటేష్ పేరును కూడా కేటీ-ఆర్ ప్రస్తావించలేదు. ఈ అంశంపై కూడా చర్చ జరుగుతోంది.
వచ్చే ఆర్నెల్లు ఎన్నికలపైనే స్పెషల్ ఫోకస్.
ఈ సారి జరిగే ఎన్నికల్లో విపక్షాలు కూడా అత్యంత కీలకంగా వచ్చే ఆరు నెలల పాటు బీఆర్‌ఎస్ ఎన్నికలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. వ్యవహరిస్తుండడంతో అవినీతి వ్యవహారాలు, గ్రూపు రాజకీయాలతో వివాదాల్లో ఉంటు–న్న వారి విషయంలో సైలెంట్‌గా ఉండడంతో వారికి టిక్కెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణాలమాలతో కేటీ-ఆర్ పర్యటనలపై ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో -టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నది. సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. రాబోయే ఆరు నెలలు పూర్తిగా ఎన్నికలపైనే ఫోకస్ పెట్టనున్నారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై గట్టిగా ఫోకస్ పెట్టారు.