సుప్రీంకోర్టు చరిత్రలో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. కరోనా నేపథ్యంలో ప్రమాణస్వీకార వేదికను మార్పు చేశారు. ఒకటో కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియంలోకి వేదికను మార్చారు. జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయించారు. జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి.
సుప్రీం కోర్టు జడ్జిలుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్‌నాథ్ ఉన్నారు. సీజేఐ సహా 9 మంది కొత్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 33కు చేరింది. సుప్రీం కోర్టుకు కొత్త జడ్జిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ జె.కె. మహేశ్వరి కూడా ఉన్నారు. ఆయన 2019 అక్టోబర్ 7 నుంచి 2021 జనవరి 5వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
ఇటీవల సుప్రీంకోర్టుకు కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తులను నియమిస్తూ.. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం వీరి పేర్లను ఆగస్టు 17న కేంద్రానికి సిఫారుసు చేసింది. ఈ ప్రతిపాదనకు ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ముగ్గురు హైకోర్టు మహిళా న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించింది సుప్రీం కొలీజియం. ఇందులో ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బి.వి.నాగరత్న 2027లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి దేశంలో ఆ స్థానానికి ఎదిగిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఆమె కాకుండా ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్, సుప్రీంకోర్టులో ఇప్పటివరకు సీనియర్ న్యాయవాదిగా ఉన్న తెలుగు వ్యక్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ కూడా భవిష్యత్తులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన