తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అమెరికాలో తన పర్యటనలో భాగంగా అనేక పెట్టుబడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఈరోజు చికాగో నగరంలో చికాగో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకో సిస్టం ను అధ్యయనం చేశారు. మంత్రి కేటీఆర్ చికాగో నగరంలోని చికాగో ఫుడ్ షాప్ ను సందర్శించి అక్కడ వరల్డ్ బిజినెస్ షికాగో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. చికాగో నగరానికి చెందిన పబ్లిక్, ప్రైవేట్ ఆర్థిక అభివృద్ధి ఏజెన్సీగా వరల్డ్ బిజినెస్ చికాగో పనిచేస్తుంది.
చికాగో ఫుడ్ షాప్ లో ఏర్పాటు చేసిన అనేక షాపులను ఆహార పద్ధతులు, వాటి చరిత్ర, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన వంటి అంశాలను పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తూనే తమ ఆహార ఉత్పత్తులు ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకతలను తెలుపుతూ వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకు పంచుకుంటూ వారి నుంచి ఫీడ్బ్యాక్ అందుకునే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను చికాగో ఫుడ్ షాప్ కలిగి ఉంది.
చికాగో నగరం ఫుడ్ ఇన్నోవేషన్ సాంప్రదాయకంగా వచ్చిన ఆహారపు అలవాట్లు, ఆహారపు ఉత్పత్తుల సరఫరా వంటి అంశాలను కాపాడుకోవడంలో అగ్రస్థానంలో ఉన్నదని చికాగో ఫుడ్ షాప్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. ప్రస్తుత ఆధునిక జీవితంలోనూ అత్యంత కీలకమైన ఆహారపు ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను వృద్ధిపరిచేందుకు తీసుకోవాల్సిన ఇన్నోవేషన్ ఈకో సిస్టం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వారు తెలిపారు.
మంత్రి కేటీఆర్ చికాగో ఫుడ్ షాప్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక వ్యాపారవేత్తలతో సంభాషించారు. ముఖ్యంగా చికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రోక్యుర్మెంట్ పద్ధతుల పైన ప్రత్యేకంగా చర్చించారు. ప్రజలకు అత్యంత కీలకమైన ఆహార సంబంధిత రంగంలో చికాగో ఫుడ్ షాప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం వంటి వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చికాగో ఫుడ్ షాప్ మాదిరి… ఫుడ్ ప్రాసెసింగ్ పురోగతికి, తెలంగాణ ఆహార ఉత్పత్తులలో ఇన్నోవేషన్, ఆహార అలవాట్ల చరిత్రను భద్రపరచడం వంటి అంశాల కోసం తెలంగాణ ఫుడ్ షాప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు కేటీఆర్.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ ప్రాధాన్యత ఎంతగానో ఉన్నదని, ఇది కేవలం ఫుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రంగం పైన ఆధారపడిన రైతులు మరియు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముల అభివృద్ధికి సైతం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అత్యవసరం అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ఇన్నోవేషన్ హబ్ గా మారెందుకు కావలసిన అన్ని రకాల అవకాశాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యవస్థను ముందుకు తీసుకెళ్తే రైతుల ఆర్థిక పురోగతి సాధ్యం మరింత వేగంగా సాధ్యమవుతుందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు నాయకత్వంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించిన అద్భుతమైన పురోగతిని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం, పాడిరంగం, మాంస ఉత్పత్తి , చేపల ఉత్పత్తి, వంటనూనెల రంగంలో వస్తున్న ఐదు విప్లవాల గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతుల సంక్షేమానికి చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలను ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలపై సమావేశానికి హాజరైన ప్రతినిధులు ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ రాష్ట్రం కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే మద్దతు ఇచ్చి ఊరుకోకుండా దాని అనుబంధ రంగమైన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందనన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, కోకా కోల , పెప్సీకో, ఐటిసి వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి కోసం పదివేల ఎకరాలకు పైగా కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తెలియజేశారు