ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డును ఏకంగా ఏడోసారి అందుకుని చరిత్ర సృష్టించాడు అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ.. అంతకుముందు 2009, 2010, 2011, 2012, 2015, 2019 సంవత్సరాల్లోనూ ఈ అవార్డును అందుకున్న మెస్సీ తాజాగా ప్యారిస్‌లో జరిగిన వేడుకల్లో మరోమారు ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మొత్తం 30 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేయగా, చివరికి రాబర్ట్ లెవాండోస్కీ, జోర్గిన్హోలను వెనక్కి నెట్టి మెస్సీ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.
మరో దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఐదుసార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. అవార్డు అందుకున్న అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం అవార్డు అందుకుంటున్నప్పుడు అదే చివరిదని భావించానని పేర్కొన్నాడు. ‘కోపా అమెరికా కప్’ను గెలుచుకోవడం వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నాడు. ఈ ఏడాది జరిగిన ‘కోపా అమెరికా కప్’ ఫైనల్లో బ్రెజిల్‌ను ఓడించిన అర్జెంటీనా కప్పును ఎగరేసుకుపోయింది. అర్జెంటీనా ఓ మెగా టైటిల్‌ను అందుకోవడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దేశానికి కప్పు అందించిపెట్టిన మెస్సీపై ప్రశంసలు కురిశాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..