హైదరాబాద్, ఆంధ్రప్రభ : బంజారాహిల్స్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో బట్టబయలైన డ్రగ్స్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రోజుకో విస్తుపోయే అంశం తెలుస్తోంది. పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో నిత్యం కనీసం రూ. 10 లక్షల వ్యాపారం జరుగుతోందని తేలింది. వారాంతం, సెలవు రోజులలో అయితే రూ. 35 లక్షల నుంచి రూ. 45లక్షల వరకు వ్యాపారం పోలీసులు జరిగినట్లు గుర్తించారు. ఈ పబ్ ఒక్క నెలలోనే దాదాపు రూ. 3.5 కోట్ల వ్యాపారం చేసిందంటే ఎంత మేర కస్టమర్లు వస్తున్నారు, ఒక్కొక్కరు ఎంత డబ్బులు వెచ్చిస్తున్నారనేది అర్థమవుతుందని పోలీసులు అంటున్నారు. పబ్‌కు వచ్చేవారంతా సంపన్నుల పిల్లలే అనీ, ఇందులో దాదాపు 15 శాతం మంది పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కాగా, నిత్యం 10 మంది వరకు విదేశీయులు వస్తుంటారని పోలీసులు గుర్తించారు.
ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో దాదాపు 61 పబ్‌లు ఉన్నాయి. ఇందులో చాలా పబ్‌లలో అర్థరాత్రి వరకు గాణాబజానా ఉంటోంది. అంటే ఒక్కో పబ్ రోజుకు కనీసం రూ. 5 లక్షల వ్యాపారం చేసినా రోజుకు రూ. 3 కోట్లు పబ్‌ల కోసం వెచ్చిస్తున్నారని స్పష్టమవుతోంది. పబ్‌లకు వచ్చే వారంతా సంపన్నులే కావడం మరో విశేషం. సంపన్నులను ఆకట్టుకునేందుకు మరికొంత మంది పబ్‌లకు వచ్చినా వారు చేసే ఖర్చు నామమాత్రంగా ఉంటుంది. అయితే పబ్‌లలో డ్రగ్స్ సరఫరా అవుతున్నందున సంపన్నులు కొంత మంది డబ్బులను ఏ మాత్రం లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒక్క పబ్‌లోనే వారంతంలో దాదాపు రూ. 40 లక్షల వ్యాపారం సాగుతోందంటే మిగతా క్లబ్‌లలోనూ వ్యాపారం జోరుగా సాగుతుందన్న విషయం స్పష్టమవుతోందని పోలీసులు అంటున్నారు.
సంపన్నులను ఆకర్షించేందుకు ఒక్కో పబ్ ఒక్కో ఈవెంట్‌ను నిర్వహిస్తుందని, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన విషయాన్ని రెగ్యులర్ కస్టమర్లకు క్లబ్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయని గుర్తించారు. ఇదే సందర్భంలో కొంత మంది డ్రగ్స్ కోసం క్లబ్‌లకు వస్తున్నారని, వారిని ఆకర్షించి అధిక మొత్తాలలో డబ్బులను వసూలు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని పబ్‌లో నిర్వాహకులకు అన్నీ తెలిసే డ్రగ్స్ సరఫరా జరిగిందని, కౌంటర్‌లోనే డ్రగ్స్ లభ్యం కావడం ఇందుకు బలం చేకూరుతుందని అంటున్నారు. అయితే ఏయే పబ్‌లలో డ్రగ్స్ అందుబాటులో ఉంటాయి, వాటిని వినియోగించే వారెవరనే విషయాలను తేల్చాల్సి ఉందని అంటున్నారు.