Wednesday, November 20, 2024

Warangal: హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్‌.. విద్యార్థుల‌కు వాంతులు, విరోచ‌నాలు, ఆరుగిరికి సీరియ‌స్‌

సోష‌ల్ వెల్ఫేర్ గ‌ర్ల్స్ హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్ అయ్యింది. దీంతో 50 మందికి పైగా స్టూడెంట్స్ వాంతులు, విరోచ‌నాలు, క‌డుపునొప్పితో విల‌విలాడిపోయారు. దీంతో వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించ‌గా వారిలో ఆరుగురి ప‌రిస్థితి సీరియ‌స్‌గా మారింది. ఈ క్ర‌మంలో మెరుగైన చికిత్స కోసం వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వర్ధన్నపేట, (ప్రభ న్యూస్): వ‌రంగ‌ల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎస్టీ బాలికల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గుర‌య్యారు. సాయంత్రం 6 గంటల సమయానికి హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు భోజనం పెట్టినట్లు విద్యార్థులు చెబుతున్నారు. భోజనం చేసిన కొద్దిసేపటి తర్వాత తీవ్ర తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు విరోచనాలకు గురైనట్లు తెలుపుతున్నారు. హాస్టల్లో 190 మంది విద్యార్థులు ఉండగా అందులో దాదాపు 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురై వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా మారి మెరుగైన అత్యవసర చికిత్స అందించేందుకు అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.

అందుబాటులో ఉన్న కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రిని చేరుకుని కన్నీరు మున్నీరయ్యేలా రోదిస్తున్నారు. ప్రైవేటు విద్య చదివించే స్తోమత లేక వారి పిల్లలను ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా హాస్టల్లో తమ పిల్లలను చేర్పిస్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు తలలు బాదుకుంటున్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం దిగ్భ్రాంతి చెందింది. ఒకపక్క చికిత్స అందిస్తున్నప్పటికీ విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.

కేవలం హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని సంఘటనా స్థలాన్ని చేరుకున్న వర్ధన్నపేట పట్టణ స్థానికులు వాదిస్తున్నారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా మారడానికి కారకులైన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల బంధుమిత్రులు అంటున్నారు. సమాచారం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆస్పత్రిని ఆశ్రయించి విద్యార్థులను, రోధిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement