హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఫుడ్ ప్రాసెసింగ్, వుడ్ ప్రాసెసింగ్ రంగాల వృద్ధికి పరస్పర సహకరం అందించుకోవడానికి రాయల్ థాయ్ గవర్నమెంట్‌తో తెలంగాణ పరిశ్రమల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, థాయ్‌లాండ్ ప్రభుత్వ ప్రతినిధులు ఈ ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్, వుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు, వాణిజ్యానికి ఉన్న అవకాశాలను రెండు ప్రభుత్వాలు పరిశీలించనున్నాయి.
ఇవి కాక చిన్న తరహా పరిశ్రమలు, స్టార్టప్‌ల వృద్ధికి సహకరించుకోవడం కూడా ఈ ఒప్పందంలోని మరో ముఖ్యమైన అంశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ థాయ్‌లాండ్ డిప్యూటీ ప్రధాని జురిన్ లక్షనవిసిట్ వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు.