- ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఉభయచరాలు, సరీసృపాలకు చెందిన పరిశోధనల వివరాలను జర్మనీకి చెందిన సలమంద్రా అనే పత్రికలో ప్రచురించడాన్ని గౌరవంగా భావిస్తారు. మిజోరాం అడవుల్లో కనుగొన్న కొత్త రకం ఎగిరే బల్లులు, గెక్కో పొపాయెన్సిస్కు దగ్గరి పోలికలున్నాయి. అయితే, శరీరాకృతి, పరిమాణం, రంగుల్లో మాత్రం తేడాలున్నాయి. మిజోరం యూనివర్శిటీకి చెందిన ప్రొ.మార్ త్లవాంతే లాల్రెమ్సంగా సారథ్యంలో ఈ గెకోలపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచంలో గెకో జెనస్ కు చెందిన 13 జాతులకు చెందిన బల్లులున్నాయి. వాటిలో చాలా రకాలు దక్షిణాసియాలో కనిపిస్తాయి.
అయితే పైఖోజూన్ లియోనోటమ్ అనే (స్మూత్ బ్యాక్డ్ గ్లైడింగ్ గెకో) అనే జాతికి చెందిన ఈ పారాచ్యూట్ గెకోలు మిజోరం అడవుల్లో మాత్రమే జీవిస్తున్నాయని ప్రొ. త్లవాంతే వెల్లడించారు. వాటి డీఎన్ఏ, ఇతర పరీక్షల అనంతరం తెలిసిందేమిటంటే… మిగతా జాతుల ఎగిరే బల్లులకూ,వీటికి చాలా తేడాలున్నాయని. మయన్మార్లో ఈ తరహా బల్లులు కన్పించినప్పటికీ పోలికలు, డీఎన్ఏ, రంగు వంటి అంశాల్లో పూర్తి వైరుధ్యం ఉండటం విశేషం. ఇవి 20 సెంటీమీటర్ల పొడవుతో ఉండి ఒక చెట్టు మీంచి మరో చెట్టుమీదకు ఎగురుతున్నాయని వారు తెలిపారు.
భారత్లో ఈ పారాచ్యూట్ బల్లుల సంఖ్య ఇతమిత్థంగా తెలీదు. అయితే, ఇక్కడ ఓ చిక్కుంది. మిజోరం ప్రజలకు బల్లులంటే మూఢనమ్మకాలు ఎక్కువ. వాటిని వేటాడి చంపేస్తూంటారు. అందువల్ల ఈ ఎగిరే బల్లులను కాపాడుకోవడం ముఖ్యమని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆ శాస్త్రవేత్తలు సూచించారు.