Saturday, November 23, 2024

కృష్ణమ్మ పరుగులు.. నది పరివాహక ప్రాంతాల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. ఎగుర ప్రాంతాల్లో వరద నేపథ్యంలో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. వరద ఉద్ధృతితో ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. దీంతో జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం ఇన్ ఫ్లో 3,16,230 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,83,269 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 884 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 208 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. డ్యామ్‌ 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి 2,96,345 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2,94,345 ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 587.20 అడుగుల మేర నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 305.5050 టీఎంసీలు నిల్వ ఉన్నది. కాగా, పర్యాటకులు కృష్ణా పరవళ్లను చూసి పరవశిస్తున్నారు.

- Advertisement -

మరోవైపు

పులిచింతల ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు డీఈఈ రఘునాథ్ సూచించారు. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పులిచింతలకు భారిగా వరదనీళ్లు తరలి వస్తుండడంతో దిగువకు నీరు విడుదల చేయనున్నామని అన్నారు. ప్రాజెక్టు సామర్ధ్యం 45.77 టీఎంసీలు ఉండగా ఇప్పటికే 41.24 టీఎంసీలు నీటిని నిల్వ ఉంచినట్లు తెలిపారు. ఎగువనుంచి 3,13,962 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తాన్ని దిగువ కృష్ణకు వదులుతున్నామని అన్నారు. 5 గేట్లను 2.5 మీటర్ల మేర ఎత్తి 3,05,962 క్యూసెక్కుల నీరు వదులుతుండగా పవర్ జనరేషన్ కు మరో 8000 క్యూసెక్కుల నీరు పోతున్నదని వివరించారు.

దిగువకు నీరు విడుదల కావడంతో నది జలకళ సంతరించుకుంది. కాలువలు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు వరదనీళ్లు భారీగా తరలివస్తున్నాయని దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అచ్చంపేట మండల తహశీల్దార్ క్షమారాణి, ఎస్సై మణికృష్ణ ప్రజలను కోరారు.

ఇక, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 2,80,000 వేల క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో2,70,000క్యూసెక్కులు. కృష్ణ ఈస్ట్రన్, వెస్ట్రన్ కాలువలకు 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మరో ఐదు రోజుల పాటు ఇదే ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి దిగువన గల నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement