హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ సుభాష్ నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బాని కట్ చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ధాటికి ప్లాస్టిక్ గోడౌన్ కుప్పకూలిపోయింది. గోడలు విరిగిపడ్డాయి. ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాస్టిక్ స్క్రాప్‌ను మిషన్‌లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తిరిగి ప్లాస్టిక్ వస్తువుల తయారీకి రా మెటిరియల్‌ను వినియోగిస్తారు. ఈ క్రమంలోనే గోడౌన్లో పాత ప్లాస్టిక్ డబ్బా ఒకటి మూత తీయకుండా మిషన్‌లో వేయడంతో ఈ ఘటన జరిగిందన్నారు..
పాత ప్లాస్టిక్ డబ్బాలు సేకరించే క్రమంలో డబ్బాలు మూతలు తీయకపోవడం, ఆ ప్లాస్టిక్ డబ్బాలో రసాయనాలు ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు అంతా భావిస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో పాత స్క్రాప్ ఏరుకునే వ్యక్తి.. ప్లాస్టిక్ డబ్బా మూత తీయబోగా పేలుడు సంభవించడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.