జూబ్లీహిల్స్ లో 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను ఘటనా స్థలానికి తీసుకొని వెళ్లి ఆదివారం (జూన్ 12) సీన్ ను రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న 18 ఏళ్లు దాటిన వ్యక్తి సాదుద్దీన్ తో పాటు మరో ఐదుగురు మైనర్ నిందితులను పోలీసులు రెండ్రోజుల క్రితం తమ కస్టడీలోకి తీసుకున్నారు. నేరం జరిగే సమయంలో నిందితులు తిరిగిన జూబ్లీహిల్స్ లోని ఆమ్నేషియా పబ్, బంజారాహిల్స్ లోని కాన్సూ బేకరీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, రోడ్డు నంబర్ 44 ప్రాంతాలకు నిందితులను తీసుకొని వెళ్లారు. అక్కడ సీన్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేశారు. అనంతరం వారిని జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు.
అయితే.. రేప్ కేసులో నిందితులకు వారి బంధువుల నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి ఫుడ్ అందించినట్టు తెలుస్తోంది. పోలీసు కస్టడీలోని నిందితులకు పోలీసులే ఫుడ్ పెట్టాలన్న రూల్ ఉంది. కానీ, ఈ రూల్‌ని అతిక్రమించేలా పోలీసులు, నిందితుల బంధువులు వ్యవహరించినట్టు తెలుస్తోంది. చికెన్, మటన్ బిర్యానీలను నిందితులకు పెట్టినట్టు బయటకు సమాచారం అందింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి రేపిస్టు మూకలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అంతేకాకుండా పోలీసుల తీరుపైనా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.