Saturday, November 23, 2024

వ‌రుస‌గా కూర్చున్న ఐదుగురు నేత‌లు – వైర‌ల్ గా ఫొటో – ఆ క్రెడిట్ నాదే – స్మృతి ఇరానీ

నిన్న యూపీ సీఎంగా యోగి ఆదిత్య‌నాథ్ వ‌రుస‌గా రెండోసారి పద‌వీ ప్ర‌మాణం చేశారు. కాగా ఈ వేడుక‌కి బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌లంతా క్యూ క‌ట్టారు. ప్ర‌ధాని మోడీతో స‌హా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర హోం, ర‌క్ష‌ణ‌, ర‌హ‌దారుల శాఖ మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్క‌రీలు కూడా ఈ వేడుక‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ ఐదుగురు నేత‌లు వ‌రుస‌గా కూర్చున్న ఫొటోను అదే పార్టీకి చెందిన ఓ కీల‌క నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ క్లిక్ మ‌నిపించారు. వివిధ ప్రాంతాల నుంచి తొలి త‌రం నేతలుగా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన ఈ ఐదుగురిలో మోదీ మిన‌హా మిగిలిన న‌లుగురూ బీజేపీ జాతీయ అధ్య‌క్షులుగా ప‌నిచేసిన వారే. వారిలో జేపీ న‌డ్డా ప్ర‌స్తుతం పార్టీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. ఇదే అంశాన్ని తెలియ‌జేస్తూ శ‌నివారం నాటి సంచిక‌ల్లో ప‌లు ప‌త్రిక‌లు ఈ ఫొటోను హైలెట్ చేస్తూ క‌థ‌నాలు రాశాయి. అయితే ఆ ఫొటోను మాత్రం ఏఎన్ఐ తీసిన‌ట్లుగా ఆయా ప‌త్రిక‌లు చెప్పాయి. యోగి ప్ర‌మాణ స్వీకారంలో బిజీగా ఉన్నా.. ఈ ఆస‌క్తిక‌ర‌మైన దృశ్యాన్ని త‌న మొబైల్‌లో చిత్రీక‌రించిన స్మృతి ఇరానీ.. ఆ త‌ర్వాత దానిని అంత‌గా ప‌ట్టించుకోలేదు. అయితే తీరా శ‌నివారం ఉద‌యం ప‌త్రిక‌లు చూసిన స్మృతి ఈ ఫొటో కింద సోర్స్‌ను చూసి షాక్ తిన్నార‌ట‌. అరెరే.. ఫొటో నేను తీస్తే క్రెడిట్ ఏఎన్ఐ ఖాతాలో ప‌డిపోయిందే ఆని ఆమె బాధ‌ప‌డ్డారు. ఇదే విషయాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement