ఎల్లారెడ్డి, (ప్రభ న్యూస్): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని అసన్ పల్లి తండా గేటు దగ్గర టాటా ఏస్ ప్యాసింజర్ వేహికల్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు చనిపోయారు. అసన్ పల్లి గేటు వద్ద ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి పట్టణంలోని మార్కెట్‌కు వెళ్లిన 26 మంది తిరిగి గ్రామానికి వస్తుంటే బియ్యం లోడుతో ఎల్లారెడ్డి వైపు వస్తున్న లారీ టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 26 మంది చెల్లాచెదురుగా రోడ్డుపైన పడిపోయారు. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా సంఘటనా స్థలంలో టాటా ఏస్ డ్రైవర్ సాయిలు 38, లచ్చవ్వ 56, అక్కడికక్కడే చనిపోయారు. పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారిలో ఒకరు చనిపోయారు. మిగిలిన11 మంది క్షతగాత్రులను దగ్గరలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ అంజవ్వ (42) కూడా చనిపోయింది. సోమర్ పేట గ్రామానికి చెందిన సుశీల స్వల్ప గాయాలతో చికిత్స పొందుతోంది. మిగిలిన 13 మంది క్షతగాత్రులను108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాన్స్వాడ ఆస్పత్రిలో వీరమణి 38, సాయవ్వ 42 కూడా చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.