తెలంగాణలో ఓ కొత్తరకం ప్రాణి కనిపించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని రాయసముద్రం చెరువు కట్టపై దేశంలోనే అత్యంత అరుదైన దృశ్యంగా చెప్పుకునే తెల్లటి ఉడుత కనిపించి అలరించింది. దీన్ని లూసిస్టిక్ స్క్విరెల్ అని కూడా పిలుస్తారు. అధికారికంగా ఇప్పటివరకు రాష్ట్రంలో ల్యూసిస్టిక్ స్క్విరెల్ ఎక్కడా కనిపించలేదు. రామచంద్రపురంలోని ఈ చిన్నారి ఉడుత తన తల్లి, తోబుట్టువుతో చెట్లపై ఆడుకుంటూ కనిపించింది. రెండు కూడా సాధారణ బూడిద-గోధుమ రంగులో మూడు చారలతో ఉన్నాయి.
నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ల్యుసిసిమ్ ఒక అరుదైన పరిస్థితి, దీనిలో జంతువులో వర్ణద్రవ్యం కోల్పోవడం వల్ల చర్మం లేదా వెంట్రుకలు తెల్లగా, లేతగా లేదా పాచీ రంగులో ఉంటాయన్నారు. ఉడుత కళ్లు సాధారణంగా ఉన్నందున అది అల్బినో ఉడుత కాదని చెప్పారు. అల్బినో జంతువుల కళ్లు సాధారణంగా గులాబీ రంగులో ఉంటాయని తెలిపారు.
లూసిస్టిక్ జంతువులు తక్కువ మనుగడ రేటును కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి వేటాడే జంతువులకు ఈజీగా చిక్కుతాయి. ఉడుతలు వంటి చిన్న క్షీరదాలలో లూసిజం చాలా అరుదు అని నిపుణులు చెప్పారు. కాలుష్యం, పర్యావరణ ప్రత్యామ్నాయాలు, తక్కువ-నాణ్యత కలిగిన ఆహారం.. ఫోలిక్యులర్ దెబ్బతినడం వంటి విభిన్న కారకాల వల్ల ల్యుసిజం సంభవించిందని చెబుతున్నారు.