Tuesday, November 26, 2024

బయో ఏషియా సదస్సు మొదటి రోజు చర్చల్లో – మంత్రి కేటీఆర్‌, బిల్‌గేట్స్‌

ఆసియాలో అతిపెద్ద లైఫ్‌-సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్‌) హైదరాబాద్‌ వేదికగా గురువారం ప్రారంభం కానున్నది. వర్చువల్‌ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ సదస్సులో వివిధ సంస్థలకు చెందిన దాదాపు 50 మంది ప్రముఖులు ప్రసంగించనున్నారు. సాంకేతికత ద్వారా ఆరోగ్య పరిశ్రమలను బలోపేతం చేయడం, కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి, హెల్త్‌కేర్‌ డెలివరీ సిస్టమ్‌ను క్రమబద్ధీకరించడంపై తొలిరోజు జరిగే చర్చల్లో మంత్రి కేటీఆర్‌తో పాటు బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ కో-చైర్మన్‌ బిల్‌గేట్స్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, యూరోపియన్‌ యూనియన్‌ ప్రధాన శాస్త్ర సలహాదారు (ఎపిడమిక్స్‌) డాక్టర్‌ పీటర్‌ పియోట్‌, భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, బయాలాజికల్‌ ఈ ఎండీ మహిమా దాట్ల, కేంద్ర బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్‌ రాజేశ్‌ ఎస్‌ గోఖలే తదితరులు పాల్గొంటారు.

ప్రపంచ లైఫ్‌సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌: కేటీఆర్‌
ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల అభివృద్ధికి హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి సదస్సును నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్‌ హబ్‌గా మార్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు.

27 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు: జయేశ్‌రంజన్‌
ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ దేశాల నుంచి 27 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకొన్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ వెల్లడించారు. గురువారం నాటికి ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement