హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు సంబురంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారం బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. గతేడాది కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన భక్తులు.. ఇప్పుడు ఆలయానికి చేరుకుని బోనం సమర్పిస్తున్నారు. ఆషాడ బోనాల సందర్భంగా కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
బోనాల వేడుకల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సింహవాహిని అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారుహోం మంత్రి మహమూద్ అలీ.
భక్తిశ్రద్దలతో భక్తులు బోనం సమర్పించుకుంటున్నారని.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వ ఏర్పాట్లు చేసిందన్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లతో పాటు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్ మళ్లించారు. సోమవారం లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి.