హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి బట్టల దుకాణం ‘సీఎంఆర్ షాపింగ్ మాల్’లో మంటలు చెలరేగాయి. ఈ సంగతి తెలిసిన వెంటనే అగ్ని మాపక దళ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. బట్టల దుకాణం కావడంతో మంటలు ఎగసి పడుతున్నాయి. మంటల తీవ్రతకు చుట్టుపక్కల దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఇండ్లు, అపార్ట్ మెంట్ల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. మంటల తీవ్రతతో అగ్ని మాపక దళ సిబ్బంది.. షాపింగ్ మాల్ వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
షాప్ మూసివేసే సమయంలో అగ్ని ప్రమాదం జరిగినందున లోపల సిబ్బంది ఉన్నారా?.. లేదా తెలియడం లేదు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా.. ఫైర్ సేఫ్టీ రక్షణ చర్యలు తీసుకున్నారా? లేదా తెలియడం లేదు. మంటలు ఆర్పిన తర్వాత గానీ పూర్తి వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. మంటలు ఎగసి పడటంతో ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు స్థానిక వాటర్ ట్యాంకర్లను రప్పించి మంటలను ఆర్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఫైరింజన్లన్నీ అక్కడికి తెలుస్తున్నది.
మంటలు ఎగసి పడటంతో వాటిని ఆర్పివేయడం కష్టంగా కనిపిస్తున్నది. సకాలంలో అగ్ని మాపక దళాలు వచ్చినా మంటలు ఆపలేకపోతున్నారు. షాపింగ్ మాల్ మూసివేసే సమయంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. ఈ సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసు, సివిల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.