Mumbai: ముంబై ప్రజలను వరుస అగ్నిప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. లాల్‌బాగ్‌లోని 60 అంతస్థుల బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. దాని పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో 19వ అంతస్తులో ఉండే ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు బాల్కనీలోకి పరిగెత్తాడు.
అక్కడి గ్రిల్స్ పట్టుకుని కిందకు దిగాలని ప్రయత్నించాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోవడంతో క్షణాల్లోనే ఆ వ్యక్తి అక్కడి నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఈ భవనంలోని ప్రజలను కాపాడేందుకు, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు శ్రమిస్తున్నాయి.