హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో ఇవ్వాల (ఆదివారం) రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ టెంట్ హౌస్‌లో మంటలు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. అయితే.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, బేగంబజార్‌లోని హోల్‌సేల్ డీలర్ దుకాణం బాబా టెంట్ హౌస్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. దీంతో టెంట్లు, ఫంక్షన్ సామగ్రి కాలిపోయాయి. దుకాణం మోజంజాహి మార్కెట్ రోడ్డులో కరాచీ బేకరీ లేన్‌లో ఉంది.
ఇక.. గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం, అసెంబ్లీ నుండి మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దీంతో గోషా మహల్-బేగంబజార్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. ముందుజాగ్రత్త చర్యగా చుట్టుపక్కల భవనాల నివాసితులను బయటకు వెళ్లాలని పోలీసులు కోరారు.
కాగా, టెంట్ హౌస్ నుంచి భారీగా పొగలు రావడంతో అక్కడ మండే పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. బేగంబజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సహకరిస్తున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.