కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో దట్టమైన పోగలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆసుపత్రిలో 35 మందికి పైగా పేషెంట్స్ ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, రోగి కుటుంబీకులు, ఆసుపత్రి సిబ్బంది, భయాందోళనతో పరుగులు తీశారు. ఆసుపత్రి అద్దాలను బద్దలు కొట్టి రోగులను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఆస్పత్రిలోని రోగులను వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఇతర ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు.