భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. కాగా ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లా గడపర్లి పంచాయతీలోని మారుమూల గ్రామం మజ్ హన్ లో చోటు చేసుకుంది. ఓ ఇంటిలో చెలరేగిన మంటలు మిగతా ఇళ్లకు వ్యాపించాయి. దాంతో గ్రామం మొత్తానికి ఈ మంటలు వ్యాపించాయి. గ్రామస్తులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితంశూన్యం. ఈ ఇళ్ల నిర్మాణంలో కలపను వాడటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది, అధికారులు చేరుకున్నారు. గ్రామసమీపంలో రోడ్డు మార్గం బాగోకపోవటంతో మూడు గంటలు పట్టింది. దాంతో 20కి పైగా ఇళ్ళు కాలి బూడిదయ్యాయని డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ తెలిపారు.
కాగా ఈ సంఘటనలో ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం అందలేదు. ఈ ప్రమాదం జరగడానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి వుండవచ్చని భావిస్తున్నారు. మంటలను ఆర్పడానికి దాదాపు మూడు గంటలు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.9కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై స్పందించిన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..