Friday, November 22, 2024

Financial Crisis – బైజూస్ బంద్‌! ఆర్థిక క‌ష్టాల్లో కంపెనీ

ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నెల ఉద్యోగుల వేతనాలు కూడా పూర్తిగా చెల్లించలేకపోయింది. అద్దె భారం భరించలేక తాజాగా దేశవ్యాప్తంగా ఆఫీసులను సైతం ఖాళీ చేయాలని నిర్ణయించింది. ఆఫీసులన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులందరూ అవసరమైన మేరకు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించారు. ఇన్వెస్టర్లతో వివాదంలో చిక్కుకున్న కంపెనీ దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఖర్చును తగ్గించుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బైజూ బెంగళూరులోని ఐబీసీ నాలెడ్జ్ పార్క్‌లో ఉన్న ప్రధాన కార్యాలయం మినహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆఫీసులను మూసివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యూష‌న్ సెంట‌ర్లు మాత్ర‌మే ప‌నిలో..

బైజూ ట్యూషన్ సెంటర్లు మాత్రమే పని చేస్తాయి. ఈ నిర్ణయం కంపెనీకి మేలు చేస్తుందని..డబ్బును ఆదా చేస్తుందని తెలిపింది. అంతకుముందు, బైజూ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతం మార్చి 10 లోపు వస్తుందని హామీ ఇచ్చారు. అయితే జీతం చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. ఉద్యోగులందరికీ పార్ట్ పేమెంట్ చేసినట్లు కంపెనీ ఆదివారం పేర్కొంది. బకాయి జీతాలు చెల్లించేందుకు ఉద్యోగులకు మరింత సమయం కావాలని కంపెనీ యాజమాన్యం లేఖ రాసింది.

వాటాదారుల మ‌ధ్య వివాదాలు

- Advertisement -

కొత్త బోర్డు ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం బైజు రవీంద్రన్, కంపెనీకి చెందిన కొంతమంది వాటాదారుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. రైట్స్ ఇష్యూ నుండి వచ్చిన డబ్బును ఉపయోగించడాన్ని కోర్టు ప్రస్తుతం నిషేధించింది. కొంతకాలం క్రితం బైజు రవీంద్రన్, అతని కుటుంబ సభ్యులను బోర్డు నుండి తొలగించడానికి వాటాదారులు ఆమోదించారు. అయితే రవీంద్రన్ ఈ సమావేశం చట్టవిరుద్ధమని ప్రకటించారు.

వివాదం ప‌రిష్కారం అయ్యేదాకా..

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఫిబ్రవరి 27న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎడ్టెక్ కంపెనీ రైట్స్ ఇష్యూ నుండి వచ్చిన డబ్బును ప్రస్తుతానికి ఎస్క్రో ఖాతాలో ఉంచాల్సి ఉంటుందని పేర్కొంది. కంపెనీ మేనేజ్‌మెంట్, నలుగురు పెద్ద పెట్టుబడిదారుల మధ్య వివాదం పరిష్కారమయ్యే వరకు ఈ డబ్బు ఉపయోగించడానికి వీల్లేకుండా పోయింది

Advertisement

తాజా వార్తలు

Advertisement