కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. వర్చువల్ గా జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో అన్నిరాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మందులు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలపై పన్ను మినహాయింపు సమావేశం ఎజెండాగా తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రాలకు పరిహారాలపై చర్చించే అవకాశం ఉంది. చమురును జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5శాతం, కొవిడ్ ఔషధాలు, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లపై 12శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. అయితే కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ట్యాక్సుల నుంచి మినహాయింపులు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేటి జీఎస్టీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో చిరు వ్యాపారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఆదాయాలు అడుగంటి పోతున్న ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగుతోంది. కరోనా వ్యాక్సిన్లు, వైద్య చికిత్సలు, ప్రాణరక్షణ ఔషధాలకు కూడా ప్రస్తుతం జీఎస్టీ విధిస్తున్నారు. అటు, వస్తు సేవల పన్ను విధానంపై రాష్ట్రాలకు ఇప్పటికే చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ పన్నుల నుంచి కరోనా మందులకు ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తోంది.