హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను కూడా అమలు చేయడం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టిన హరీష్.. కేంద్రం తీరును ఎండగట్టారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను హరించివేస్తోందని దుయ్యబట్టారు. ఎన్ని రకాల ప్రతికూలతలు, అడ్డంకులు సృష్టిస్తున్నా.. రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తోందని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టడంతో ప్రారంభమైన వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు కోల్పోవలసి వచ్చిందని హైకోర్టు ఏర్పాటు చేయకుండా ఐదేళ్లపాటు తాత్సారం చేశారని మండి పడ్డారు.
మోడీకి చెప్పినా.. ప్రయోజనం శూన్యం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని హరీష్‌రావు అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో మరింత పురోగమించి లక్షల మందికి ఉపాధి లభ్యమయ్యేదని చెప్పారు. రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాలను కేంద్రం వెనకబడిన జిల్లాలుగా గుర్తించినా.. అందుకు సంబంధించిన నిధులను ఇవ్వడంలోనూ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కోరినా.. ప్రయోజనం లేదని ఎన్నో దఫాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా, నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లి వెళ్లి ప్రధానిని కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆక్షేపించారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వలేదని బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని రైల్వే కనెక్టివిటీ ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి కంటి తుడుపుగా రూ.20 కోట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రూ.495 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసిందని ఈ మొత్తాన్ని ఇవ్వాలని గత ఏడేళ్లుగా ప్రాధేయ పడుతున్నా పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న నివ్జ్‌ుకు కేంద్ర వాటా రూ.500 కోట్లు ఇంతవరకు విడుదల చేయలేదని ఆరోపించారు. కరోనాతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా రాష్ట్రాలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. న్యాయ సమ్మతంగా దక్కాల్సిన నిధుల్లో కోత విధించిందని ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పెంపుదలకు విద్యుత్ సంస్కరణలకు ముడ్డి పెట్టడం అత్యంత దారుణమని చెప్పారు. ఆరు నూరైనా విద్యుత్ సంస్కరణలు అమలు చేయమని కేంద్రానికి సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రాలకు పన్నుల్లో 41 శాతం వాటాగా ఇవ్వాల్సి ఉన్నా ఆ మొత్తాన్ని కూడా కేంద్రం తగ్గించివేసిందని ఆరోపించారు. ఇన్ని రకాల ప్రతికూలతలు, పరిమితుల మధ్య తెలంగాణ రాష్ట్రం బలీయమైన శక్తిగా ఎదుగుతోందని ఆయన అన్నారు.
ఇంకా వివక్షే…
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా వివక్షే ఎదురవుతోందని, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్రం అదే పని చేస్తోందని ఆరోపించారు. కేంద్ర వైఖరి ‘కాళ్లల కట్టె పెట్టినట్టు ఉందన్నారు. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై దాడిని ప్రారంభించిందని అన్నారు. ఆర్థిక సంఘాల సిఫారసులను కేంద్రం ఆమోదించడం ఆనవాయితీ కానీ కేంద్రం ఈ ఆనవాయితీని ఏమాత్రం పాటించకుండా 15వ ఆర్థిక సంఘం 2020-21లో రాష్ట్రానికి రూ.723 కోట్లను ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని సిఫారసు చేసినా దీన్ని బుట్ట దాఖలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి ఇచ్చే నిర్దిష్ట గ్రాంట్లు రూ.2,362 కోట్లు విడుదల చేయలేదని సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్లు రూ.3024 కోట్లు ఇవ్వలేదని ఈ మొత్తం గ్రాంట్లు రూ.5,386 కోట్లు నిధులను ఇవ్వకుండా కేంద్రం తొక్కి పెట్టిందని ఆరోపించారు.
కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అన్యాయం
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని ఆరోపించారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని ఒక్క పథకానికి డబ్బులు ఇవ్వలేదని అంతా శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు అన్నారు. రాష్ట్రానికి రుణాలు తీసుకువచ్చి అభివృద్ధి చేసుకుందామనుకున్నా దానికి మోకాలడ్డుతోందని ఆరోపించారు.
ఇంకా హరీష్ ఏమన్నారంటే…
– తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా తయారైంది.
– తెలంగాణ ఆస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన సీఎం కేసీఆర్.
సమైక్య రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా నానా అగచాట్లు పడుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని కేసీఆర్ మేల్కోల్పారు.. ఉద్యమాన్ని రగిల్చి రాష్ట్రాన్ని సాధించిన తీరు చారిత్రాత్మకం.
– తెలంగాణ సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సాధికారత కలిగిన ఉద్యమ సారధిని స్వరాష్ట్ర రథసారధిగా ప్రజలు ఎన్నుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను కేసీఆర్ భుజస్కందాలపై మోపారు.
సీఎం కేసీఆర్‌పై ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని వందకు వంద శాతం నిటబెట్టుకుంటూ ఆనాడు ఎంతటి నిబద్ధతతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారో అంతే నిబద్ధతతో ఈనాడు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టిస్తున్నారు.
– పోరాట దశ నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు నూతన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా అవతరింపజేసిన సందర్భం వరకు అంతా కళ్ల ముందే జరిగిన, జరుగుతున్న అద్భుత చరిత్ర.
– పటిష్టమైన ఆర్థిక ప్రగతిని సాధిస్తూ అవినీతికి ఆస్కారం లేని విధంగా టీఎస్-ఐపాస్, టీఎస్-బీపాస్, ధరణి, డిజిటల్ నగదు బదిలీ వంటి పారదర్శక విధానాలు అమలు చేయడంతో రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచాం.
– ప్రగతి ప్రస్థానంలో అనేక సవాళ్లను అధిగమించాం. ప్రజల అండదండలతో తెలంగాణను అద్భుతమైన ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారు.
-నేడు తెలంగాణ ఆచరించింది రేపు దేశం అనుసరిస్తోంది.
-నాయకుడు దక్షత ఉన్న వాడైతే లక్షలకైనా.. కోట్లకైనా సార్థకత చేకూరుతుంది.
-ఖాజనాకు ఎంత ధనం వచ్చిందన్నది కాదు.. ఆ ధనం ప్రజల జీవితాల్లో ప్రతిఫలించిందా.. లేదా అన్నది ముఖ్యం.