భీమా కోరేగావ్ కేసులో నిందితుడు, విప్లవ రచయిత వరవరరావు వైద్యపరమైన కారణాలతో శాశ్వత బెయిల్‌ను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ మంజూరుకు సంబంధించి రేపు (జులై 19న) స్పందన తెలియజేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను జస్టిస్ యు.యు నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ పిటిషన్‌పై నోటీసు జారీ చేసి ఆగస్టు 10న విచారణ చేపడతామన్నారు న్యాయమూర్తులు. కాగా, తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా వరవరరావుకు మధ్యంతర రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
వైద్యపరమైన కారణాలతో శాశ్వత బెయిల్ కావాలని 83 ఏళ్ల వరవరరావు పిటిషన్ దాఖలు చేయగా.. బాంబే హైకోర్టు ఏప్రిల్ 13న ఈ పిటిషన్‌ని తిరస్కరించింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఈ అంశం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. కాగా, ‘‘మేము అధికారికంగా నోటీసు జారీ చేయలేదు. ఒకవేళ మీరు అంగీకరించినట్లయితే తుది విచారణకు వెళ్తాము. మీరు ఏదైనా పిటిషన్ పెట్టాలనుకుంటే సమయం ఇస్తాము”అని న్యాయమూర్తులు S.R. భట్, సుధాన్షు ధులియా అన్నారు. కేవలం వైద్య పరిస్థితి మాత్రమే సమస్యగా ఉన్న ఈ విషయంలో విస్తృత విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసు 2017, డిసెంబర్ 31న పుణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ కాన్క్లేవ్‌లో చేసిన ప్రసంగాలకు సంబంధించినది. ఆ మరుసటి రోజు పశ్చిమ మహారాష్ట్ర శివార్లలోని కోరెగావ్-భీమా యుద్ధ స్మారక చిహ్నం సమీపంలో హింసను ప్రేరేపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్న వ్యక్తులే ఈ కాన్‌క్లేవ్‌ను నిర్వహించారని పూణే పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈ కేసుపై ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్స) విచారణ చేపట్టింది.
కాగా, వరవరరావును 2018, ఆగస్ట్ 28న హైదరాబాద్‌లోని తన ఇంటి నుండి అరెస్టు చేశారు. పలు సెక్షన్లు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కింద 2018, జనవరి 8న పూణే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తొలుత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనను గృహనిర్బంధంలో ఉంచారు. 2018, నవంబర్ 17న అతడిని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. 2021, ఫిబ్రవరి 22న బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.