మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్లగొండ పట్టణంలోని అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్‌లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
21 టేబుల్స్.. 15 రౌండ్లు..
ఓట్ల లెక్కింపునకు 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ లను నియమించారు. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. మొత్తంగా 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.
ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం
మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. తొలి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తి స్థాయి ఫలితం వెలువడనుంది.
మొదటగా చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా.. మొదటగా చౌటుప్పల్ మండల పరిధిలో నమోదైన ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణ పురం, మునుగోడు, చండూర్, మర్రిగూడం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను వరుసగా లెక్చించనున్నారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో, సీసీ కెమెరా ల పర్యవేక్షణ లో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.