Friday, November 22, 2024

ఆక‌స్మాత్తుగా అస్వ‌స్థ‌త‌కి గురైన ఫైలెట్ – సుర‌క్షితంగా విమానాన్ని ల్యాండ్ చేసిన ప్ర‌యాణికుడు

ఒక్కోసారి ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అలాంటి ఓ సంఘ‌ట‌నే జ‌రిగింది అమెరికాలోని ప్లోరిడాలో…వివ‌రాల్లోకి వెళ్తే…విమానం న‌డుపుతోన్న పైల‌ట్ అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యాడు. దీంతో విమానంలోని ఒక ప్రయాణికుడు ఫోర్ట్ పియర్స్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను సంప్రదించాడు. విమానంలో పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని, పైలట్‌ ఆకస్మికంగా అస్వస్థతకు గురైనట్లు చెప్పాడు. దీంతో విమానం నడపడం వచ్చా అని ఆ వ్యక్తిని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అడిగాడు. విమానం నడపటం తనకు రాదని ఆ వ్యక్తి తెలిపాడు. ఫ్లోరిడా తీరం తనకు కనిపిస్తున్నదని అన్నాడు. ఆ విమానాన్ని ప్యాసింజర్‌ సీటు నుంచి కూడా కంట్రోల్‌ చేయవచ్చు. దీంతో అదే స్థాయిలో విమానాన్ని స్థిరంగా ఉంచాలని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ క్రిస్టోఫర్ ఫ్లోర్స్ చెప్పాడు. తీరానికి పశ్చిమ లేదా దక్షిణ వైపునకు విమానాన్ని నడపాలని సూచించాడు. అనంతరం ఆ విమానాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ గుర్తించారు. అప్పుడు అది బోకా రాటన్ మీదుగా ఉత్తరం వైపునకు వెళ్తున్నది. ప్రయాణికుడి వాయిస్‌ సరిగా వినిపించకపోవడంతో కంట్రోలర్‌ అతడి మొబైల్‌ నంబర్‌ తీసుకున్నాడు. మరోవైపు 20 ఏళ్ల అనుభవం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రాబర్ట్ మోర్గాన్, విమానంలోని ప్రయాణికుడితో మాట్లాడారు. సెస్నా ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన అనుభవంతోపాటు ఆ విమాన శిక్షకుడైన ఆయన అందులోని ప్రయాణికుడికి పలు సూచనలు ఇచ్చారు. ఆ విమానం ఈజీగా ల్యాండ్‌ అయ్యేందుకు ఆయన సహకరించారు. దీంతో ఆ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఆ వెంటనే కొత్త పైలట్‌కు అభినందనలు అని కంట్రోలర్ రాబర్ట్ మోర్గాన్ అన్నారు. రెస్క్యూ సిబ్బంది ఆ విమానం వద్దకు వచ్చారు. అస్వస్థతకు గురైన పైలట్‌కు వైద్యచికిత్స అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement