Monday, November 18, 2024

కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 15 మంది ఎవరు?

హుజురాబాద్ ఉపఎన్నిక రాజకీయంగా వేడి పెంచుతోంది. నేతల ఆరోపణలు, విమర్శలతో రసవత్తర రాజకీయం సాగుతోంది. వలసల పరంపర మొదలు కానుందని సంకేతాలు వస్తున్నాయి. ఓ పార్టీ నుంచి గెలిచి.. మరో పార్టీ చేరుతున్న నాయకులను చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు ఇక సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఆపరేషన్ ఆకర్ష్ కు పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన 12 మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని అంటున్నారు హస్తం నేతలు. ఇక, టీఆర్ఎస్ నుంచే తమ పార్టీలోకి వలసలు మొదలు కానున్నాయని అంటున్నారు.  

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్‌ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బాంబ్ పేల్చారు. హుజురాబాద్ ఉపఎన్నిక ముగియగానే కేసీఆర్‌కు షాక్ తప్పదని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందన్న షబ్బీర్ అలీ.. హుజురాబాద్‌లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు.

గాంధీ భవన్ లో గాడ్సే ఉన్నారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను షబ్బీర్ అలీ తిప్పి కొట్టారు. గాడ్సే కొత్త అవతారం ప్రగతిభవన్‌లో విశ్రాంతి తీసుకుంటోందని సీఎం కేసీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కేసీఆర్ వారం వారం ఎందుకు కలుస్తున్నారో సమాధానం చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

మరోవైపు షబ్బీర్ అలీ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి గోడ దూకేందుకు నిజంగానే ఎమ్మెల్యేలు సిద్ధమైయ్యారా? వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని ఆ ఎమ్మెల్యేలు కోల్పోయారా? లేక టికెట్లు తమకు దక్కవు అనే అనుమానంతో ఇప్పటి నుంచే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. షబ్బీర్ అలీ చెప్పిన ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు? అన్న చర్చ విసృత్తంగా సాగుతోంది.

నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. నిరాశలో ఉన్న కార్యకర్తలను ఉత్సహం నెలకొంది. రేవంత్ పై ఉన్న నమ్మకంతో టీఆర్ఎస్ లోని కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. మొత్తం మీద హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయా? అన్నది చూడాలి.

- Advertisement -

ఇది కూడా చదవండి: Fire: అగ్గిపెట్టె రేట్.. అమాంతం పెంచేశార‌ట‌

Advertisement

తాజా వార్తలు

Advertisement