Saturday, November 23, 2024

Big Story: పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువ.. ఎస్జీటీ పోస్టుకు ఫుల్ డిమాండ్

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ : టీచర్‌ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీ దిశగా అధికారులు సన్నాహాలు చేపడుతుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల నుంచి సరైనా నోటిఫికేషన్‌ వెలువడకపోవడంతో టీచర్‌ ఉద్యోగాలపై డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి టీచర్‌ పోస్టులకు ఎన్నడూ లేనివిధంగా భారీ పోటీ ఉండే అవకాశం కనబడుతోంది. దాదాపు 5 లక్షల మంది బీఎడ్‌, డీఎడ్‌ అభ్యర్థులు టెట్‌, టీఆర్టీ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ నియామక పరీక్ష కోసం ఎదురు చూస్తున్న వారు కొందరు ఉంటే, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని టెట్‌ పరీక్ష రాసేందుకు మరికొందరు ఉన్నారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధించలేని వారు, సాధించిన వారు సైతం ఈ సారి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నూతన జోనల్‌, జిల్లాలకు ఉద్యోగుల విభజన అనంతరం భారీ స్థాయి ఖాళీలతో టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తారని అభ్యర్థులు భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19వేల వరకు ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఇందులో కేవలం 13,086 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం భారీ ఉద్యోగ ప్రకటనను వెలువరిస్తదని అభ్యర్థులంతా అనుకున్నారు. కానీ ఊహించిన స్థాయిలో టీచర్‌ పోస్టుల ప్రకటన వెలువడలేదు. దీంతో బీఎడ్‌, డీఎడ్‌ అభ్యర్థులు కాసింత నిరాశలో ఉన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన 13,086 పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులే అధికంగా ఉన్నాయి. 6500 నుంచి 7వేల వరకు ఎస్జీటీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. 2500 వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు ఉన్నాయి. మరో 600 వరకు భాషాపండితుల పోస్టులు. మిగిలినవి, పీడీ, పీఈటీ, డ్రాయింగ్‌ టీచర్‌, క్రాఫ్ట్‌ టీచర్‌, ఒకేషనల్‌ టీచర్‌, మోడల్‌ స్కూల్స్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి. ప్రతి జిల్లాల్లో సుమారు 100 నుంచి 200 వరకు ఎస్జీటీ పోస్టులు ఉంటే, ఎస్‌ఏ, ఇతర పోస్టులు 10లోపే ఉన్నాయి. ఖాళీల్లో ఎస్జీటీ పోస్టులన్నీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనుండగా, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను మాత్రం 70 శాతం పదోన్నతులు, 30 శాతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేస్తారు. దీంతో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అటు బీఎడ్‌, డీఎడ్‌ అభ్యర్థుల నుంచి భారీ పోటీ ఉండనుంది.

పేపర్‌-1కు పోటీ ఎక్కువ…
2017 గత టీఆర్టీకి డీఎడ్‌ అభ్యర్థులు 5,415 ఎస్జీటీ పోస్టులకి దాదాపు 61వేల మంది పోటీ పడ్డారు. దాదాపు 2వేల ఎస్‌ఏ పోస్టులకు 2 లక్షల మంది బీఎడ్‌ అభ్యర్థులు పోటీ పడ్డారు. త్వరలో వెలువడే టెట్‌, టీఆర్టీకి 5 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. దాదాపు నాలుగు నుంచి ఐదేళ్లుగా టెట్‌, టీఆర్టీ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో కొత్తగా బీఎడ్‌, డీఎడ్‌ కోర్సులు చేసిన వారు లక్ష మంది, గత టెట్‌ పరీక్షల్లో అర్హత పొందని 2 లక్షల మందితో పాటు గతంలో పాసై వెయిటేజీ కోసం రాసే మరో 2 లక్షల మంది పోటీ పడేందుకు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 5 లక్షల మంది ఇప్పుడు టెట్‌ రాయనున్నారు. పేపర్‌-1(ఎస్జీటీ)కి బీఈడీ వాళ్లకు అవకాశం ఇస్తే 5 లక్షల మంది డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులు కలిపి పోటీ పడనున్నారు. పేపర్‌-2(ఎస్‌ఏ)కి బీఎడ్‌ అభ్యర్థులు దాదాపు 3 లక్షల మంది రాయనున్నారు. ఇదిలా ఉంటే 2015 నుంచి పదోన్నతులు కల్పించలేదు. ఏడేళ్లుగా ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. జూన్‌లో ఉపాధ్యాయ బదిలీలు చేస్తామని, పదోన్నతులు కల్పించనున్నారు. పదోన్నతులు కల్పిస్తే జిల్లాలో ఖాళీల సంఖ్య మరిన్ని పెరగనున్నాయి.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ బోధనను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య కూడా పెరగనుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను ఇంకా నియమించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ వేసేటప్పుడు 13వేలకు అదనంగా ఇంకా కొన్ని పోస్టులు కలిపి ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాలకు వేరువేరుగా జారీ చేస్తారో చూడాల్సి ఉంది. 20వేల పోస్టులతో మెగా టీఆర్టీ వేయాలి: రావుల రామ్మోహన్‌ రెడ్డి. డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాఠశాల విద్యాశాఖలో ఉన్న దాదాపు 20వేల ఖాళీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేయాలి. గత ఐదేళ్లుగా పదవి విరమణ ద్వారా ఏర్పడ్డ ఖాళీలు, విద్యా వాలంటీర్‌ ఖాళీలు, పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలతో మెగా టీఆర్టీ నోటిఫికేషన్‌ వేయాలి. టెట్‌ నోటిఫికేషన్‌ పరీక్షకు రెండు నెలల గడువు ఇచ్చి ఆ వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీ చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement