Tuesday, November 26, 2024

TS | పాలిటెక్నిక్ కాలేజీల్లో పెర‌గ‌నున్న‌ ఫీజులు.. గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 5 పాలిటెక్నిక్‌ కళాశాలలకు ఫజులు రూ. 40 వేలు పెంచుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఫీజుల నియంత్రణ కమిటీ తక్కువ ఫీజు ఖరారు చేస్తే విద్యార్థులకు మిగతా మొత్తాన్ని చెల్లించాలనే షరతు విధించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26 కి వాయిదా వేసింది. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులను అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఎఫ్‌ఆర్‌సీ) పరిధిలోకి తేవాలని నిరుడు ఫిబ్రవరిలో సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాధించింది. ఆప్పటి నుంచి దీనిపై సర్కార్‌ నిర్ణయం తీసుకోలేదు.

కౌన్సెలింగ్‌ ప్రారంభమైనందున ఫీజులు పెంచుకునేందుకు అనుమతించాలని 5 పాలిటెక్నిక్‌ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను మరోమారు హైకోర్టు విచారించింది. దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ స్పందించకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకునేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేరుగా హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.

ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. పాలిటెక్నిక్‌ కోర్సులను ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోకి తేవడంలో జరిగిన జాప్యంపై వివరణ ఇచ్చారు. మరోమారు జాప్యం జరగకుండా చూస్తామని, కోర్టు ఆదేశం మేరకు వారంలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ న్యాయవాది హామీ మేరకు వాకాటి కరుణ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించాలనే నిర్ణయాన్ని విరమించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement