‘‘మాస్క్ ధరించడంపై జనాలా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా ఇంకా పోలేదు.. మళ్లీ విజృంభిస్తోంది.. ప్రాణాలమీదికి వస్తే కానీ పరిస్థితి ఏంటో తెలియదు.’’ అని చాలామంది డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే దేశంలో 2శాతం ప్రజలే మాస్కు ధరిస్తున్నట్టు తెలిపింది లోకల్ సర్కిల్స్ సర్వే. ఇది ఒక డిజిటల్ ఫ్లాట్ ఆధారంగా పనిచేసే సంస్థ. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ వచ్చి వెళ్లిన తర్వాత కూడా ప్రజలు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలిపింది. ఒమ్రికాన్ వేరియంట్ పెరుగుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
దేశంలోని 364 జిల్లాలో తాము సర్వే నిర్వహించినట్టు ఆ సంస్థ పేర్కొంది. ఈ సర్వేలో 25,000 మంది అభిప్రాయాలను సేకరించామని చెప్పింది. మాస్కు ధరించడంలో ఆయా ప్రాంతాల్లో ఎంత మంది బాధ్యతాయుతంగా ఉంటున్నారని ఈ సర్వేలో పాల్గొన్న వారిని ప్రశ్నించినట్టు తెలిపింది లోకల్ సర్కిల్స్ సర్వే సంస్థ..
ఈ ప్రశ్నలకు చాలా ఇంట్రెస్టింగ్ రీజన్స్ చెప్పారట.. 30శాతం మంది తమ ప్రాంతంలో చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం లేదని తెలిపారు. కేవలం 2 శాతం మంది ప్రజలు మాస్క్ తప్పని సరిగా ధరిస్తున్నారని చెప్పారు. మాస్క్ ధరించడం పట్ల వారు బాధ్యతగా ఉంటున్నారని వెల్లడించారు. మీ ప్రాంతంలో ప్రజలు మాస్కు వెంట తీసుకెళ్లడం అలావాటు చేసుకున్నారా? అని ప్రశ్నించగా.. 34 శాతం మంది తమ ప్రాంతంలో ప్రజలు మాస్క్ వెంట తీసుకెళ్లడం లేదని చెప్పారు. మాస్క్‌ను వెంట ఉంచుకున్నప్పటికీ చాలా మంది ధరించడం లేదని మరో 23 శాతం మంది జవాబు చెప్పారు. చాలా మందికి మాస్క్ ఎలా ధరించాలో ఇప్పటికీ తెలియదని 38 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సర్వేలో 69 శాతం పురుషులు పాల్గొనగా.. 31 శాతం మహిళలు పాల్గొన్నారు.
మాస్క్ పట్ల ప్రజల్లో ఉన్న అవగాహనను తెలుసుకుందామని ఈసర్వేను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. ఆ సమయంలో 29 శాతం ప్రజలు మాస్క్ నిబంధనలు కచ్చితంగా పాటించారని తెలిపారు. సెప్టెంబర్ నెలలో అది 12 శాతానికి పడి పోయిందన్నారు. ఇక నవంబర్ నెలల ఆ పరిస్థితి మరింత దిగజారి 2 శాతానికి పరిమితమయ్యిందని తెలిపారు. మాస్కు పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలపై ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.