Thursday, November 21, 2024

ఏకైక రాజధానిగా అమరావతినే.. హైకోర్టు తీర్పుపై రైతులు హర్షం

అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. వెలగపూడిలో చేస్తున్న దీక్షా శిబిరం వద్ద వారు ట‌పాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబ‌రాలు జ‌రుపుకున్నారు. హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. కోర్టు తీర్పు ద్వారా ఇంకా న్యాయం బ‌తికే ఉందని నిరూపిత‌మైంద‌ని ఆనందం వ్యక్తం చేశారు.  

రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది.  రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని స్పష్టం చేసింది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరచిన ప్లాట్లను అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement