Saturday, November 23, 2024

కేంద్రం తీరు – సేద్యం బేజారు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కష్టమొచ్చినా, నష్టమొచ్చినా.. దేశానికి అన్నం పెడుతున్న రైతులను విపత్కర పరిస్థితులు వెంటాడుతున్నాయి. పంటల సీజన్‌ ప్రారంభంలో పెట్టుబడులు సమకూర్చుకునే సమస్యలతో సతమవుతున్న రైతాంగానికి, మార్కెటింగ్‌ సీజన్‌లో ఉత్పత్తులను అమ్ముకోవడానికి అంతకు రెట్టింపు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో సమానంగా దూసుకుపోతున్న మనం వ్యవసాయ రంగంలో మాత్రం తిరోగ మనం వైపు వెళ్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు మనకు సాక్షాత్కరిస్తున్నాయి. ప్రతియేటా గండం నుంచి గట్టెక్కుతామన్న నమ్మకంతోనే ముందడుగు వేస్తున్న కర్షక లోకానికి చివరకు ఆశలన్నీ కల్లగానే మిగుతున్నాయి. వారిని ఆదుకోవాల్సిన బాద్యత గల ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. మద్దతు ధరల నిర్ణయం, నియంత్రణపై అధికారాలు, బాద్యతల నిర్వహణలో చిక్కుముడి సమస్యలు తలెత్తుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పపడుతున్న సమన్వయ లోపం రైతులకు శాపంగా మారుతోంది. మద్దతు ధరల నియంత్రణ పూర్తిగా కేంద్ర సర్కారు ఆధీనంలోనే ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే చర్యలు కేవలం ఉపశమనంగా మిగులుతున్నాయి. ఈ క్రమంలో పండించిన ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర అందక రైతుల ఆహాకారాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రతినబూనింది. ఈ క్రమంలో తీసుకున్న నేషనల్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ మిషన్‌ (ఇ-నామ్‌) వ్యవస్థను బలోపేతం చేసి మద్దతు ధరలు కల్పించడంలో రాష్ట్రాల ప్రమేయం ఉండాలన్న నిర్ణయం మరుగున పడింది. వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వస్తున్న నూతల ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాల్సిన కేంద్రం ఈ రంగాన్ని తిరోగమనం వైపు నెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. నేటి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే రైతులకు రెట్టింపు ఆదాయం అటుంచి.. పెట్టుబడి కూడా చేతికందని దౌర్భాగ్యం వెంటాడుతోంది. ఈ విషయంలో గడిచిన దశాబ్ద కాలంగా పాలకుల మాటలే తప్ప, కొనుగోళ్ళ వ్యవస్థలో ఏమాత్రం మార్పు రాలేదు.


ప్రత్యేకించి ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులను ”రెట్టింపు ఆదాయం” అన్న ప్రకటనలు ఆశల పల్లకిలో విహరింపచేశాయి. గడిచిన వ్యవసాయ సంవత్సరంలోనూ వారికి ఊహించని కష్టనష్టాలు తప్పలేదు. పంటల సాగులో విత్తనాలు మొదలుకొని, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, డీజెల్‌ ధరలు అమాంతంగా పెంచేశారు. నిత్యావసర ధరలు పెరగటంతో వ్యవసాయ కూలీల ధరలు పెరిగి ఆ భారం కూడా పరోక్షంగా పంటలసాగుపైనే పడింది. 2022నాటికి వ్యవసాయ రంగంలో రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఘోరంగా విఫలం చెందిన ప్రధాని మోడి సాగు ఖర్చులు పెంచటంలో మాత్రం సఫలం అయ్యారన్న విమర్శలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇటీ-వల కేంద్ర ప్రభుత్వ అర్ధగణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం వ్యవసాయ రంగానికి సంబంధించి దేశంలో రైతు కుటుంబాల సగటు- రాబడి రూ.9403 అని తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగం పట్ల చేస్తున్న కృషిలో డొల్లతనం బయటపడింది. ఇటీ-వల పార్లమెంట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రైతుల ఆదాయం 60శాతం పెరింగిందని ప్రకటించి రైతుల్లో నవ్వుల పాలయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరేళ్లలో ద్రవ్యోల్బణం 35.3శాతం ఉంటే దాన్ని దాచి పార్లమెంట్‌లో రైతుల ఆదాయంపై మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం వికటించింది. రైతు కుటు-ంబం సగటు- నెల రాబడి 2012-13లో రూ.6,427 ఉండగా, 2018 నాటికి అది రూ.10,218కి చేరింది. 2022నాటికి ఇది రూ.9403కు పడిపోయిందని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల వెల్లడించారు. కేంద్రలో నరేంద్ర మోడి ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరానికి వ్యవసాయ శాఖకు చేసిన కేటాయింపు రూ.1,24,000 కోట్లు- మాత్రమే. పంటల సాగులో ఇన్‌పుట్‌ సబ్సిడీలను పెంచి రైతులను ప్రోత్సహించకపోగా ఆహారధాన్యాల ఉత్పత్తలో మాత్రం లక్ష్యాలను 308 మిలియన్ల మెట్రిక్‌ టన్నుల నుంచి 315మిలియన్ల మెట్రిక్‌ టన్నులకు పెంచింది. ఒకవైపు రసాయనిక ఎరువుల ధరలను పెంచిన కేంద్రం ఆదే నిష్పత్తిలో పంటలకు మద్దతు ధరలు పెంచటంలో మాత్రం విఫలం చెందినట్లు లెక్కలు చెబుతున్నాయి.

పీఎం కిసాన్‌ పథకం లక్షలాది మందికి అందని ద్రాక్షే..
ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకంలో ఇప్పుడిస్తున్న రూ.6 వేల ప్రోత్సాహకం చాలటం లేదని, దీన్ని రూ.15 వేలకు పెంచాలని రైతులు, రైతు సంఘాలు జాతీయ స్థాయిలో ఘోషిస్తున్నాయి. పథకం ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా పెంచలేదు. పైగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకంలో ప్రయోజనం పొందుతున్న రైతుల సంఖ్యను 11.74కోట్ల నుంచి 11కోట్లకు కుందించింది. 74లక్షల మంది రైతులను ఈ పధకం నుంచి తొలగించింది. దేశమంతటా రైతులకు ఇస్తున్న మొత్తం రూ.2 లక్షల కోట్లకు మించటం లేదు. కిసాన్‌ క్రిడిట్‌ కార్డుల సంఖ్యను కూడా 376లక్షల వద్దనే నిలిపివేసింది. ఈ పథకం ద్వారా ఇస్తున్న క్రెడిట్‌ లిమిట్‌ కూడా అన్ని రాష్ట్రాల్రకు కలిపి ఏటా రూ.4,33,426 కోట్లు- కాగా, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి కేసీఆర్‌ ప్రభుత్వం ఏటా రైతులకు బ్యాంకుల ద్వారా వ్యవసాయం వాటి అనుబంధ రంగాలకు రూ.1,12,762 కోట్లు- రుణాలు అందజేయిస్తోది. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్‌ క్రెడిట్‌ కార్డు స్కీంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం ఏటా 25శాతం ఇక్కడే అమలు చేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణలో కూడా కేంద్రం నామమాత్రపు నిధులలో సరిపెడుతోంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతి విధానాలపై మోడి సర్కారు దాటవేత ధోరణి అటు-ంచి, పంటల సీజన్‌లో ఎగుమతులపై నిషేధం విధించి ధరలు తొక్కిపెట్టి రైతుల కడుపు కొడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్వేషణ స్థాయి దాటని ఎగుమతులు, దిగుమతులు
గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్‌ చివరలో పత్తి ధరలు పడిపోతుండటానికి అధికారులు, వ్యాపారులు కారణాలను అన్వేషిస్తున్నారు. సాధారణంగా పత్తి, ఇతర వ్యవసాయోత్పత్తుల ధరలను ఇక్కడి నుంచి ఎగుమతులు, ఇతర దేశాల నుంచి జరిగే దిగుమతులు ప్రభావితం చేస్తాయి. దేశీయంగా రైతులకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్రం పత్తి ఎగుమతి సుంకాన్ని తగ్గించి, దిగుమతులపై ఆంక్షలు విధించింది. అయితే అంతర్జాతీయ విపణిలో ధరలు తక్కువగా ఉండటం, చైనా నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రాకపోవడం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. అలాగే గతానికి భిన్నంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా పత్తి ధరలు ఏకరీతిగానే ఉంటు-న్నాయి. వివిధ మార్కెట్‌లలో నాణ్యతను బట్టి ధరలో రూ.100 నుంచి రూ.200 వరకు వ్యత్యాసం ఉంటు-ంది. కరోనా సమయంలో వస్త్‌ పరిశ్రమలో ఉత్పత్తులు నిలిచిపోవడంతో దేశీయంగా పత్తి బేళ్ల నిల్వలు అధికంగా ఉండటం కూడా ప్రస్తుత ధరల అనిశ్చితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నేటికీ వంట నూనెలు దిగుమతిపైనే ఆధారం
వ్యవసాయమే ప్రధానమైన మన దేశంలో నేటికీ వంట నూనెలు పూర్తిగా దిగుమతిపైనే ఆధారపడి ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి రావాల్సిన పొద్దుతిరుగుడు నూనెల దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా దేశీయంగా నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావం పత్తి గింజలపై కూడా పడింది. గింజల నుంచి నూనె లభిస్తుండటం, మన రాష్ట్రంలోని పత్తి గింజల పరిమాణం ఎక్కువగా ఉండటం కూడా ఈ సీజన్‌ మొదట్లో పత్తి ధరలు పెరగడానికి కారణమైంది. క్రమంగా ఉక్రెయిన్‌తో పాటు- రష్యా నుంచి కూడా భారీగా పొద్దుతిరుగుడు నూనెలు దిగుమతి అవుతుండటంతో దేశీయంగా నూనెల ధరల స్థిరీకరణ జరిగింది. దీంతో పత్తి గింజల ధరలు పడిపోయాయి. సీజన్‌ మొదట్లో క్వింటాలు పత్తి గింజల ధర రూ.4500 వరకు పలికింది. ప్రస్తుతం వీటి ధర రూ.3000 నుంచి రూ.3100 వరకే పరిమితం కావడం పత్తి ధరను ప్రభావితం చేస్తోంది. మన వద్ద పండే పత్తిలో 64 శాతం గింజ, 33 శాతం దూది లభిస్తుంది. 3 శాతం తరుగు ఉంటు-ంది. ఇలాంటి పరిస్థితుల్లో పత్తి ధర పెరుగుదల కష్టంగానే కనిపిస్తోందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement