Saturday, November 23, 2024

Delhi: సింఘూ బార్డర్ ఖాళీ.. ఇంటి బాటపట్టిన రైతులు!

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా చేస్తున్న ఆందోళనను రైతులు విరమించారు. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకోవ‌డంతో ఆందోళ‌నల‌ను రైతులు విర‌మిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ శీతాకాలం సమావేశాల తొలిరోజే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. దీంతో రైతులు సొంతూళ్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఢిల్లీ సరిహద్దులోని ఘాజిపూర్‌, సింఘూ, టిక్రీ బోర్డ‌ర్లను విడిచి రైతులు త‌మ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. సింఘూ బోర్డ‌ర్‌ వ‌ద్ద వేసిన టెంట్ల‌ను రైతులు తొల‌గించారు. రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీచేసి ఇళ్లకు వెళ్తున్నారు. విజయోత్సవంతో ర్యాలీలు చేసుకుంటూ ఇళ్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.

రైతులు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు మద్దతు ధర హామీ చట్టం, రైతులపై కేసులు ఎత్తివేయడంతో పాటు విద్యుత్ చట్టాలను కూడా రద్దు చేయాలన్న రైతుల డిమాండ్ ను కేంద్రం అంగీకరించింది. మద్దతుధర విషయమై కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో రైతులు ఏడాదిగా చేస్తున్న ఉద్యమానికి తెర పడింది.

కాగా, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలంటూ ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు ఏడాది కాలంగా రైతులు పోరాటం చేశారు. గతేడాది నవంబర్ 26న రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన మొదలు పెట్టారు. ఈ ఆందోళ‌నలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్, హ‌ర్యానా, పంజాబ్, ఉత్త‌రాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి ల‌క్ష‌ల సంఖ్యలో రైతులు ఆందోళ‌నలు చేశారు. ఈ ఏడాది కాలంలో ఉద్య‌మంలో పాల్గొన్న 700 మంది రైతులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement