మామిడిసాగును పెంచడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేలా ఉద్యానవనశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాగు చేస్తున్న రైతులను ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి విదేశాలకు ఎగుమతి చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. మహారాష్ట్రలోని సహ్యాద్రి ప్రాంతంలో మామిడి సాగు ఆకట్టుకుంటోంది. ఆ ప్రాంతంలో విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. వాళ్లు ఎలా సాగు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు మామిడిసాగు చేస్తున్న రైతులను ఆ ప్రాంతానికి స్టాడీ టూర్‌కు తరలివెళ్లారు.
ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి: రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సునందారెడ్డి పర్యవేక్షణలో మామిడిసాగు చేస్తున్న రైతులు, అధికారులు మహారాష్ట్రకు తరలివెళ్లారు. బస్సులో సోమవారం బయలుదేరి వెళ్లారు. ఈనెల 24వ తేదీ తిరిగి రానున్నారు. మహారాష్ట్ర లోని సహ్యాద్రి ప్రాంతంలో మామిడి సాగు లాభాలు ఆర్జించిపెడుతోంది. వీరు సక్సెస్ కావటానికి కారణాలు తెలుసుకునేందుకు మామిడి సాగు చేస్తున్న రైతులను తీసుకెళ్లి అక్కడి పరిస్థితులపై అద్యాయనం చేయనున్నారు.
ఎలా సాగు చేశారు… లాభాలుఎలా వస్తున్నాయి… విదేశాలకు ఎలా ఎగుమతి చేస్తున్నారనే విషయమై రైతులకు అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో 27,480 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో 22,577 ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలు సాగు చేస్తున్నారు. జిల్లా పరిధిలోని మొయినాబాద్, కందుకూరు, కేశంపేట, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, తలకొండపల్లి మండలాల పరిధిలో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. మామిడి సాగు చేస్తున్న రైతులు ఒక్కరే విదేశాలకు ఎగుమతి చేయడం సాధ్యం కాదు. అందుకే మామిడి సాగు చేస్తున్న రైతులను ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువమంది రైతులు కలిసి విదేశాలకు ఎగుమతి చేసేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే స్టాడీ టూర్‌కు వెళ్లారు.