పవిత్ర గురు పురబ్, కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ పునః ప్రారంభం సందర్భంగా ఈరోజు (శుక్రవారం) దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. “ఈ రోజు యావత్ దేశానికి శుభవార్త చెప్పడానికి వచ్చాను. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేస్తాం” అన్నారు ప్రధాని మోడీ.
జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దేశంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా పంట సరళిని మార్చడానికి.. ఎమ్ ఎస్ పిని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ఈ కమిటీలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తల ప్రతినిధులు ఉంటారని వెల్లడించారు.
‘‘2014 లో దేశానికి ప్రధానమంత్రిగా సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినప్పుడు వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) ను పెంచడమే కాకుండా, రికార్డు సంఖ్యలో ప్రభుత్వ సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం చేసిన ఉత్పత్తుల సేకరణ గత అనేక దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టింది” అన్నారు.
‘‘మూడు వ్యవసాయ చట్టాల లక్ష్యం ఏమిటంటే, దేశ రైతులు, ముఖ్యంగా చిన్న రైతులను బలోపేతం చేయాలి, వారు తమ ఉత్పత్తులకు సరైన ధరను పొందాలి. అలాగే వారు తమ పంటలను అమ్ముకునే అవకాశాలు పెరగాలి. రైతుల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా చిన్న రైతుల కోసం, వ్యవసాయ రంగం ప్రయోజనాల కోసం, గ్రామీణ పేదల ఉజ్వల భవిష్యత్తు- పూర్తి సమగ్రత, స్పష్టమైన మనస్సాక్షి, రైతుల పట్ల అంకితభావంతో ఈ చట్టాలను తీసుకువచ్చాం” అన్నారు ప్రధాని మోడీ..
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..