న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడలో అమాయక రైతులు బలవుతున్నారని తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు, నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో బుధవారం టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ వేదికగా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించాలని అమిత్ షా బీజేపీ నేతలకు సూచించారని అన్నారు. తన వద్ద అన్ని వివరాలు ఉన్నాయన్న అమిత్ షా కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్‌కు మధ్య ఉన్న అనుబంధం, ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజాన్ని రెండు పార్టీలు కలిసి మోసం చేస్తున్నాయని…. బండిసంజయ్, కిషన్ రెడ్డిలు ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
తెలంగాణలో చాలదన్నట్టు టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో వీధి నాటకాలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను పక్కదోవ పట్టించేందుకే ఈ నాటకాలని నొక్కి చెప్పారు. రబీ సీజన్‌లో పండిన దానిని కొనుగోలు చేసే అంశంపై మాట్లాడకుండా మళ్లీ వర్షాకాలంలో పండే పంట గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందడం తప్ప రైతాంగ శ్రేయస్సు కోసం కేసీఆర్ మరే ప్రయత్నమూ చేయడం లేదని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు అంశంపై అమిత్ షా డైరెక్షన్‌లో కేసీఆర్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన వ్యూహాల మీద నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త డైరెక్షన్‌లో నడుస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సునీల్ అనే వ్యూహకర్త బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలకు నాయకుడిగా మారారని, త్వరలోనే అన్ని అంశాలను వివరిస్తానని పేర్కొన్నారు.
గత సంవత్సరం రబీలో 52 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే, ఈ రబీలో వరి సాగు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలు ఇంటెన్సివ్‌గా ప్రకటిస్తే, ఉత్పత్తైన మొత్తం ధాన్యం ఎగుమతి చేయవచ్చని సూచించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతం అందరికీ తెలిసినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీవీసీ, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్‌ల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదన అందలేదని తన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీన్నిబట్టి గిరిజనులపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… వరి వేస్తే ఉరి అంటూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని వాపోయారు. ప్రజా ధనాన్ని దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. పోరాడతామని గల్లీలో చెప్పి ఢిల్లీ వచ్చి కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. ఐకేపీ సెంటర్లు పెట్టింది… రైతులకు రుణమాఫీ చేసి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి నొక్కి చెప్పారు. అరిగిపోయిన రికార్డులా కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమంటూ బీజేపీ నేతలు చెబుతున్నారే గానీ ఫలితం కనిపింట్లేదన్నారు. కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారని, కేసీఆర్ 400 ఎకరాల ఫామ్‌హౌస్‌కి నీళ్ళు మళ్లించుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎరువుల ధరలు పెంచి రైతులను గోస పెడుతున్నారని, కామారెడ్డిలో రైతులు వరికుప్పల దగ్గరే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాటకాలు బంద్ చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హితవు పలికారు. నల్గొండలో వరి తప్ప ఏమీ పండదన్న ఆయన రైతుల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులు 1300 నుంచి 1400 రూపాయలకే ధాన్యం అమ్ముకుంటున్నారని మధు యాష్కీ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన 18 వేల కోట్ల రూపాయల అవినీతి నుంచి తప్పించుకోవడానికి టీఆర్ఎస్, బీజేపీ కలిసి నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.