Tuesday, November 26, 2024

Big Story: పత్తి పంటమీదనే రైతుల ఇంట్రెస్ట్​.. ఈ ఏడాది పెరగనున్న సాగు విస్తీర్ణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : పత్తి పంటకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలకడంతో రాష్ట్ర రైతాంగం ఈ పంటను పెద్ద సంఖ్యలో సాగు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. వరంగల్‌లోని ఎనుమామూల వ్యవసాయ మార్కెట్‌, కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట కాటన్‌ మార్కెట్‌లో ఈ ఏడాది పత్తి క్వింటాలుకు రూ.10,500 నుంచి 12,500 వరకు రికార్డు స్థాయిలో ధర పలకడంతో రైతాంగం ఈ పంటను పండించేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధర అమాంతం పెరడంతో ఈ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఈ పంటను సాగు చేసేందుకు కర్షకులు సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి మాసంలో వరంగల్‌ ఎనుమామూల మార్కెట్‌లో ఎర్రమిర్చి క్వింటాలుకు రూ.50వేల ధర పలికింది. ఖమ్మం మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఈ పంటను కూడా సాగు చేసేందుకు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

సాగునీరు యోగ్యత లేని భూముల్లో పెద్దఎత్తున ఈ పంటను వేసేందుకు రైతులు సన్నాహాలు ప్రారంభించారు. తొలి ప్రాధాన్యత పత్తి పంట వేసేందుకు ముందుకు వస్తుండగా ఆ తర్వాత మొక్కజొన్న పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు ఆయా జిల్లాల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో కర్షకులు దుక్కి దున్ని విత్తనాలు వేసే ప్రక్రియకు శ్రీకారం చట్టారు. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో ప్రవేశిస్తున్నాయన్న వాతావరణ శాఖ అధికారుల కబురుతో విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. యాసంగి సీజన్‌లో వరి వేయవద్దని పంటల మార్పిడిపై దృష్టి సారించాలని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కోరిన సంగతి తెలిసిందే. అయినా రైతులు వరి పంట వేయడం ఆ తర్వాత ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్ర పరిధిలోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ససేమిరా అనడంతో ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

వర్షాకాలం పండించిన వరిని సేకరించేందుకు ఎఫ్‌సీఐ సన్నద్ధత తెలిపినా రాష్ట్ర రైతాంగం ప్రత్యామ్నాయ పంటలను వేసేందుకు సిద్ధమవైనట్టు సమాచారం. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువతో పాటు శ్రీరాంసాగర్‌, కాళేశ్వరం ప్రాజెక్టుల కింద నీరు వచ్చే భూముల్లో వరి సాగుకు రైతులు సిద్ధమై నార్లు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల సూచనతో రైతులు బురద మడులను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖతో పాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు సూచిస్తున్నా పత్తి, మొక్కజొన్న పంటలవైపు అధికంగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం జరిగిందని ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురవాల్సి ఉందని రైతులంటున్నారు. ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి రైతులు విత్తనాలు వేసినట్టు వాతావరణ శాఖకు సమాచారం అందింది. మిగతా జిల్లాల్లో వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు.

ఈ ఏడాది పత్తి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికిందని పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రైతులు సైతం వారి వారి ప్రాంతాల్లో పండించి పత్తిని తెలంగాణలోకి తీసుకువచ్చి విక్రయించారని తద్వారా మంచి రేటును పొందారని రైతలంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నూలుకు డిమాండ్‌ పెరగడంతో రాష్ట్రంలో రైతులు పండించిన ఈ పంటకు మంచి డిమాండ్‌ వచ్చి రికార్డు స్థాయి ధర పలికిందని ఈ పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందా, లేదా అన్నది అధ్యయనం చేయవలసి ఉందని చెబుతున్నారు. ఏయే జిల్లాల్లో ఎంత విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్న, వరిని పండించారన్నది ఈ నెలాఖరుగానూ తెలియదని ఆయా జిల్లాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు సర్వే నిర్వహించి పూర్తి వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ద్వారా పంపిస్తారని అప్పుడు సమాచారం తెలుస్తుందని ఇక్కడి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ అధికారులు చెబుతున్నారు.

ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌, మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వ్యవసాయానికి యోగ్యంకాని భూముల్లో అధికంగా పత్తి, మొక్కజొన్న పంటలను పండిస్తున్నారని బావులున్న ప్రాంతాల్లో కొంతమేర వరిని సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పారు. అక్కడక్కడ వాణిజ్య పంటలైన పొద్దుతిరుగుడు, మిరప, సోయా, చిరుధాన్యాలు రాగులు, సజ్జలు, పప్పుధాన్యాలు కంది, పెసర, మినుము వంటి పంటలను పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement