తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు- పర్యావానాలపై లఘు చర్చను ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు. దీనిపై మండలిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారా చర్చను లేవనెత్తారు. కాగా, సీఎం కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడుతున్నారు. కేంద్రం, రాష్ట్రాలకు మధ్య దూరం పెరిగిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రాలు ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. ఏ రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండానే కేంద్రం విద్యుత్ సంస్కరణ బిల్లు తీసుకువచ్చిందని, దీంతో రైతుల పొలాల వద్ద ఉండే కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.
దీన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, తాను బతికి ఉన్నంత కాలం రైతుల పొలాల వద్ద మోటార్లు పెట్టనీయబోనన్నారు. దీనిపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాటలను కోట్ చేస్తూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరు, బీజేపీ తీరును అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు. కొంతమంది లీడర్ల కేంద్రం మీటర్లు పెట్టడం లేదని చెబుతున్నారని, కానీ, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో తమ ఎమ్మెల్యేల బృందం పరిశీలించగా.. అక్కడ పంట పొలాలకు మీటర్లు పెట్టిన విషయం వెల్లడయ్యిందన్నారు. దీనికి బీజేపీ లీడర్లుకానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏం సమాధానం చెబుతుందో చూడాలన్నారు సీఎం కేసీఆర్.
కాగా, అంతకుముందు ఇటీవల చనిపోయిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు నిమిషాలపాటు సభ సంతాపం తెలిపింది. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతోపాటు మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లులను మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి హరీశ్‌రావు, అటవీ యూనివర్సిటీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు సంబంధించిన బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మోటర్ వెహికిల్స్ టాక్సేషన్ సవరణ బిల్లులును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రవేశపెట్టారు. విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారు.