Friday, November 22, 2024

మిర్చి కాదు ఎర్ర బంగారం.. క్వింటా మిర్చి రూ.48వేలు.. సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : దేశీయ మిర్చి క్వింటాల్‌ ధర రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఏకంగా బంగారంతో మిర్చి ధర పోటీ పడుతోంది. రోజు రోజుకు దూసుకుపోతున్న బంగారం ధరలకు తీసిపోనివిధంగా క్వింటాల్‌ మిర్చి ధర కూడా పరుగులు పెడుతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్‌ నేపథ్యంలో ఎన్నడు లేని విధంగా మిర్చి ధర అమాంతం పెరిగిపోయింది. దేశ చరిత్రలోనే క్వింటాల్‌ మిర్చికి ఆల్‌ టైమ్స్‌ రికార్డు ధరలు నమోదవుతున్నాయి. దీంతో రైతుల ఇంట ఎర్రబంగారం సిరుల పంట పండిస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న దేశీయ మిర్చి క్వింటాల్‌ ధర ఇప్పుడు రూ.50వేలకు చేరవయింది. మిర్చి ధర ఇంత పలకడం ఇదే తొలిసారి అని రైతులు చెబుతున్నారు. కరీంనగర్‌ జిల్లా, వరంగల్‌ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు మిర్చి ధర రూ.50వేలకు చేరువలో ఉంది. ఈ మార్కెట్లలో మంగళవారం నాడు క్వింటాల్‌ ధర రూ.48వేలకు చేరువలో నమోదైంది. కొద్ది రోజుల కిందట క్వింటాల్‌ మిర్చి ధర రూ.37వేలు పలకగా … ఇప్పుడు ఏకంగా 50వేలకు చేరువలో ఉంది.

గత రెండు వారాలుగా మిర్చి ధర రి కార్డులు సృష్టిస్తోంది. 20 రోజులుగా మిర్చి ధర రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది కాని తగ్గటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ మిర్చికి భారీ డిమాండ్‌ ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఎనమాముల మార్కెట్‌కు వచ్చి మిర్చి కొనుగోలు చేస్తున్నారు. ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు మిర్చిని వాడుతుంటారు. దేశీ రకం మిర్చి ఎక్కువగా పండించే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆకాల వర్షాలతో పంట తవ్రంగా దెబ్బతింది. వేలాది ఎకరాల్లో మిర్చి పంట నేలపాలైంది. అకాల వర్షాల కారణంగ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయినప్పటికీ మార్కెట్లో రేట్లు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పత్తి ధర కూడా…

మిర్చితోపాటు పత్తి ధర కూడా రికార్డు స్థాయిలో పలుకుతోంది. ఈ మార్కెట్లో పత్తికి కూడా భారీగా ధర పలుకుతోంది. క్వింటాలు పత్తికి రూ.10,720 పలుకుతుంది. సగటున రూ.9,325గా నమోదైంది. జమ్మికుంట మార్కెట్‌కు 12 ట్రాలీలు పత్తి విక్రయానికి రాగా, గరిష్టంగా రూ.10,810 ధర పలికింది. వరంగల్‌లో రూ.10,720, ఖమ్మంలో రూ.10,600 పలకింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement